![కేంద్ర బడ్జెట్ ను సవరించాలి](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-witnesses-massive-protest-against-central-budget-at-indira-park_394xG8TYgf.jpg)
- కార్పొరేట్లపై 4% సంపద పన్ను వేయాలి
- పేదలపై భారం తగ్గించాలి.. కొనుగోలు శక్తి పెంచాలి
- ప్రజా సంఘాల పోరాట వేదిక మహాధర్నాలో వక్తలు
- ఇండ్ల స్థలాల పోరాటానికి అండగా ఉంటామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసేలా, సామాన్యులపై మరింత భారం మోపేలా ఉందని వక్తలు ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు. పేదలపై భారం తగ్గించి, కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 20 ప్రాంతాల్లో పేదలు చేస్తున్న పోరాటాలకు అండగా ఉంటామని ప్రకటించారు.
సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్దధర్నా చౌక్ లో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్లపై నాలుగు శాతం సంపద పన్ను వేస్తే దేశ బడ్జెట్ను రూ. లక్ష కోట్లు పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ సర్కారు సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదాన్ని ఇచ్చిందని, కానీ ఆర్ఎస్ఎస్ కా సాత్.. అంబానీ, అదానీ కా వికాస్ గా మార్చి పాలన చేస్తోందన్నారు.
పారిశ్రామికవేత్తల జేబులు నింపేందుకే కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్లకు రూ. 7 లక్షల కోట్లు కేటాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్లు లేవని, వారిలో చాలా మంది ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని పోరాటాలు చేస్తున్నారన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పిన మోదీ.. ఈ బడ్జెట్ లో గృహ నిర్మాణ రంగానికి అరకొరగానే నిధులు ఇచ్చారని విమర్శించారు.
కార్మికులను పట్టించుకోని బడ్జెట్ ఎందుకు?
దేశ సంపద కొద్దిమంది చేతుల్లోకే వెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. దేశంలోని 30 కోట్ల మంది ఉపాధి కూలీలకు రూ.2 లక్షల కోట్లు ఎందుకు కేటాయించలేదు? అని ప్రశ్నించారు.
‘కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఉండొద్దా? దీనికోసం సమ్మెలు చేయాలా? కార్మికులను పట్టించుకోని ఈ బడ్జెట్ ఎందుకు?” అని ఆయన ఫైర్ అయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లు మరింత దోచుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు.