యూకేలో రోడ్డు ప్రమాదం.. కోమాలోకి వెళ్లిన హైదరాబాద్ మహిళ

  • కోమాలోకి వెళ్లినట్లు తెలిపిన డాక్టర్లు 
  • వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని ఆమె తల్లి అభ్యర్థన

ఎల్బీనగర్, వెలుగు : సిటీలోని చైతన్యపురికి చెందిన ఓ మహిళ యూకేలో కేర్​టేకర్ గా పనిచేసేందుకు వెళ్లి, అక్కడ జరిగిన యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆమె వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చైతన్యపురికి చెందిన వెంకట రమణమ్మ కూతురు హిమబిందు తెలిసిన వారి ద్వారా 5 నెలల కింద యూకేలోని ప్రెస్టన్​ సిటీకి వెళ్లింది. అక్కడి బ్రొకె హెవెన్ అనే హాస్పిటల్ లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది.

అయితే గత నెల 24న అక్కడ రోడ్డు దాటుతున్న టైంలో ఓవర్ స్పీడుతో దూసుకొచ్చిన ఓ ట్రక్ ​ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు హాస్పిటల్​లో అడ్మిట్​చేసి చికిత్స అందిస్తున్నారు. హిమబిందు ప్రస్తుతం కోమాలో ఉంది. ట్రక్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ మత్తులో రాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్​కు కారణమైనట్లు గుర్తించారు. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, తన బిడ్డ హిమబిందు వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని శనివారం మీడియా ముందు అభ్యర్థించారు. హిమబిందుకు 8 ఏండ్ల కూతురు ఉందని, పాప తమ వద్దే ఉంటుందని వెంకట రమణమ్మ తెలిపారు.