- ఇండియా టీమ్‌కు ఎంపికైన హైదరాబాదీలు అవనీష్, అభిషేక్
ముంబై: కొంతకాలంగా డొమెస్టిక్ జూనియర్ సర్క్యూట్‌లో సత్తా చాటుతున్న హైదరాబాద్ యంగ్ క్రికెటర్లు ఆరవెల్లి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్ ప్రతిభకు గుర్తింపు లభించింది. ఈ ఇద్దరూ అండర్19 వరల్డ్ కప్‌లో పాల్గొనే ఇండియా టీమ్‌కు ఎంపికయ్యారు. సౌతాఫ్రికాలో వచ్చే నెల 19 నుంచి జరిగే మెగా టోర్నీ కోసం ఆలిండియా జూనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.
ఇదే జట్టు సౌతాఫ్రికాలో ఈ నెల 29 నుంచి జనవరి 10 వరకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఇండియా మధ్య జరిగే ట్రై సిరీస్‌లోనూ పోటీ పడుతుంది. పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా, మధ్యప్రదేశ్ క్రికెటర్ సౌమీ కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అవనీశ్, స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ కూడా ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ దుబాయ్‌లో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్‌లో పోటీ పడుతున్న ఇండియా టీమ్‌లో ఉన్నారు. అక్టోబర్–నవంబర్ లో జరిగిన బీసీసీఐ మెన్స్ అండర్19 వన్డే చాలెంజర్ ట్రోఫీలో అవనీష్ 3 మ్యాచ్‌ల్లో సెంచరీ సహా 161 రన్స్ తో రాణించి ఇండియా–ఎ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆపై, నవంబర్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఇండియా–ఎ, బి అండర్ 19 జట్ల మధ్య జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లోనూ అవనీశ్, అభిషేక్ సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 18 ఏండ్ల అవనీష్ భారీ సెంచరీ చేయగా, 19 ఏండ్ల అభిషేక్ ఫిఫ్టీతో పాటు 2 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. దాంతో ఆసియా కప్‌లో చాన్స్ దక్కించుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు వరల్డ్ కప్ కూడా ఆడబోతున్నారు.
వరల్డ్ కప్, ట్రై-సిరీస్ టీమ్: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్ (కెప్టెన్), అవనీష్ రావు (కీపర్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అభిషేక్, ఇనేష్ (కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ; స్టాండ్ బై (ట్రై సిరీస్): ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, ఎండీ. అమన్; బ్యాకప్ ప్లేయర్స్: దిగ్విజయ్, జయంత్ గోయత్, విఘ్నేష్, కిరణ్.