
మియాపూర్, వెలుగు: స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడం, మహిళా చేతిలో మోసపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చిన్నబావి మండలం పెద్ద దగడ గ్రామానికి చెందిన భరత్కుమార్కుటుంబంతో కలిసి సిటీలోని ఎంఏనగర్లో నివసిస్తున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కుమారుడు గణేశ్(26) లోన్ యాప్, క్రెడిట్ కార్డుల ద్వారా పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులను స్టాక్ మార్కెట్ లో పెట్టి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఇదిలా ఉండగానే గణేశ్ గతంలో మెడ్ ల్యాబ్ కంపెనీలో జాబ్ చేసి మానేశాడు.
ఇటీవల ఓ మహిళా మెడ్ల్యాబ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామని, కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ లో లక్ష రూపాయల ఫోన్25 వేలకే అందిస్తున్నామని చెప్పింది. ఇది కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమేనని చెప్పడంతో నమ్మిన గణేశ్మహిళ చెప్పిన అకౌంట్కు రూ. 25 వేలను పంపించాడు. ఈ ఆఫర్ఇంకా కొనసాగుతుందని, ఫ్రెండ్స్ కు కూడా ఇప్పించడని సదరు మహిళ చెప్పడంతో గణేశ్9మందితో రూ.25వేల చొప్పున ఫోన్కోసం డబ్బులు కట్టించాడు.
కొద్ది రోజుల నుంచి ఆ మహిళా స్పందించకపోవడంతో గణేశ్ ను ఫ్రెండ్స్ డబ్బులు అడుగుతూ వచ్చారు. దీంతో గణేశ్ తండ్రి, బంధువులు ఆ డబ్బులను చెల్లించారు. స్టాక్ మార్కెట్ లో నష్టాలు రావడం, మహిళా చేతిలో మోసపోవడంతో గణేశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే ఇంట్లో ఉన్నఫ్యాన్ కు గణేశ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. మియాపూర్పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.