- గంజాయి, డ్రగ్స్ పై స్పెషల్ సెల్‌ల ఏర్పాటు
- అన్ని ఏరియాల్లో నిరంతరం తనిఖీలు చేయాలని సీపీల ఆదేశం
- గ్రేటర్‌లోని 3 కమిషనరేట్లలో స్పెషల్ ఆపరేషన్స్
హైదరాబాద్,వెలుగు: గంజాయి, డ్రగ్స్ నివారణ కోసం గ్రేటర్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. 3 కమిషనరేట్లలో సీపీలు స్పెషల్ సెల్స్ ను ఏర్పాటు చేశారు. సిటీతో పాలు శివారు ప్రాంతాల్లోని రాచకొండ,సైబరాబాద్ లిమిట్స్‌లో నిఘా పెట్టారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి ఓఆర్‌ఆర్‌పై జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. సీపీలు అంజనీకుమార్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్ గంజాయి, డ్రగ్స్ స్పెషల్ డ్రైవ్‌ను నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు ప్రతి పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో స్పెషల్ రైడ్స్ నిర్వహించాలని సీపీలు ఆదేశించారు. దీంతో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్‌ను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 13 గంజాయి, డ్రగ్స్ సప్లయ్ కేసుల్లో 21 మందిని అరెస్ట్ చేశారు.
స్థానిక యువత సాయంతో..
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు కానిస్టేబుల్స్‌తో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. పీఎస్ లిమిట్స్‌లోని బస్తీలు, లిక్కర్ అడ్డాలు,పబ్లిక్ ప్లేసెస్‌లో పోలీసులు నిఘా పెట్టారు. గంజాయి అమ్మకాలు, సప్లయ్ గురించి సమాచారం అందించేలా స్థానిక యువతను ఇందులో భాగస్వాములను చేశారు. అనుమానాస్పద ఏరియాల్లో మఫ్టీలో డెకాయ్ ఆపరేషన్ కు ప్లాన్ చేశారు. కాలనీలు,అపార్ట్‌మెంట్స్‌లోని సీనియర్ సిటిజన్స్‌తో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఆయా కాలనీల్లోని యువత అలవాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యానికి బానిసలైన యువకుల వివరాలు తెలుసుకుంటున్నారు. అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
పాత నేరస్తుల నుంచి సమాచారం
3 కమిషనరేట్లలో గతంలో నమోదైన గంజాయి కేసుల డేటాతో పాత నేరస్తులను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. గంజాయి కేసులో జైలుకి వెళ్లిన నిందితులు బయటికొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో గమనిస్తున్నారు. పాత నేరస్తులు ఇచ్చే సమాచారంతోఅమ్మకాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. సప్లయర్స్ నెట్‌వర్క్‌లోని చైన్ సిస్టమ్ ఆధారంగా రైడ్స్ నిర్వహించేందుకు స్కెచ్ వేశారు. కస్టమర్ల ఫోన్ నంబర్స్‌తో కాంటాక్ట్ అవుతున్నారు. గంజాయికి బానిసైన యువకుల ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ ఇచ్చేలా ప్లాన్ చేశారు.
లంగర్ హౌస్‌లో సప్లయర్ అరెస్ట్
లాల్ దర్వాజకు చెందిన బి.ఆనంద్‌సింగ్(25), కోమల్ సింగ్(28) దంపతులు సిటీలో గంజాయి సప్లయ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి లంగర్‌హౌస్ దర్గా సమీపంలోని కస్టమర్ల నుంచి వీళ్లు ఆర్డర్ తీసుకున్నారు. 4 ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన గంజాయితో ఆనంద్‌సింగ్ లంగర్ హౌస్ కి వెళ్లాడు. ఈ దందా గురించి సమాచారం అందుకున్న లంగర్ హౌస్ పోలీసులు దర్గా దగ్గర నిఘా పెట్టి ఆనంద్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గరి నుంచి కిలో 300 గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి భార్య కోమల్ సింగ్ కోసం గాలిస్తున్నారు.
గంజాయి, డ్రగ్స్ గురించి తెలిస్తే పోలీసులకు చెప్పండి
సిటీలో గంజాయిని అరికట్టేందుకు స్పెషల్ సెల్స్‌ను ఆపరేట్ చేస్తున్నాం. టార్గెట్ పూర్తి చేసేందుకు పనిచేస్తున్నాం. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, జహీరాబాద్‌కు గంజాయి సప్లయ్ జరుగుతోంది. గంజాయి, డ్రగ్స్ సప్లయర్ల గురించి తెలిస్తే డయల్ 100 లేదా 9490616555 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. అంజనీకుమార్, సీపీ, హైదరాబాద్