చైనాలో వైరస్ తగ్గుముఖం.. హెచ్ఎంపీవీపై పరేషాన్ అక్కర్లేదంటున్న భారత వైద్యులు

బీజింగ్: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఉత్తర చైనావ్యాప్తంగా వైరస్ వ్యాప్తి తగ్గుతోందని అక్కడి హెల్త్ డిపార్ట్​మెంట్ ఆదివారం ప్రకటించింది. ఇమ్యునిటీ పవర్ కాస్త తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధుల్లో మాత్రమే జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పింది. ఆ ఇన్ఫెక్షన్లు కూడా వాటికవే తగ్గిపోతున్నాయని పేర్కొంది. మిగతావాళ్లలో హెచ్ఎంపీవీ ఎలాంటి ప్రభావం చూపట్లేదని స్పష్టం చేసింది.

ఈ వైరస్ ఇప్పడేం కొత్తది కాదని, ఎన్నో ఏండ్లుగా మనుషుల్లో ఉంటూనే ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్​ సైంటిస్ట్ వాంగ్ లిపింగ్ వెల్లడించారు. 2001లో నెదర్లాండ్స్​లో మొదటిసారిగా హెచ్ఎంపీవీ వైరస్​ను గుర్తించారని తెలిపారు. వైరస్​లను గుర్తించే టెక్నాలజీ ఇటీవలి కాలంలో పెరగడంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఆస్పత్రుల్లో మాస్కులు పెట్టుకుని ఉన్న ఎక్కువమంది పేషెంట్లకు సంబంధించిన వీడియోలు ఆన్​లైన్​లో సర్క్యులేట్ కావడం కూడా జనాల్లో అనవసరపు ఆందోళనలు కలిగించిందని చెప్పారు.

ఇదేం కొత్త వైరస్ కాదు.. భారత వైద్యులు

హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేం కాదని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని మన దేశ హెల్త్ నిపుణులు ఆదివారం సూచించారు. ఈ వైరస్ సోకినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకినవాళ్లకు జ్వరం, దగ్గు, అలసట, శ్వాసకోశ ఇబ్బందులు, గొంతునొప్పి, ఒల్లు నొప్పులు వంటి లక్షణాల్లో కొన్ని ఉండొచ్చని తెలిపారు. వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు డాక్టర్ల సాయంతోపాటు, ప్రాథమిక జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచించారు.

శుభ్రంగా ఉండటం, మాస్క్ పెట్టుకోవడం ద్వారా తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. హెల్దీ ఫుడ్ తింటూ, తగినంత నిద్రపోవడం అవసరమని చెప్పారు. ఉన్నట్టుండి అత్యధికంగా వైరస్ వ్యాపిస్తున్నట్లుగా చైనా నుంచిగానీ, మరే ఇతర దేశం నుంచిగానీ రిపోర్టు అందలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్​ కూడా ఇదివరకే తెలిపింది.