
చీరకట్టులో మహిళలు చేసిన ‘మార్నింగ్ రన్’ ఆకట్టుకున్నది. టాటా బ్రాండ్ తనైరా, బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్లో శారీ రన్ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,120 మంది మహిళలు పాల్గొన్నారు. రంగు రంగుల చీరలు ధరించి యూనిటీ, స్పిరిట్ చాటారు. పలువురు హైఎండ్ బైకులపై సందడి చేశారు.
తనైరా సీఈఓ అంబుజ్ నారాయణ , జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ మాట్లాడుతూ.. మహిళలు ఫిట్నెస్, స్వీయ వ్యక్తీకరణపై అవగాహన కలిగి ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో చీరకట్టు ప్రత్యేకమైన జీవన సరళి అని, దీనికి గుర్తింపు తీసుకురావడం కోసం చీరకట్టుతో రన్ నిర్వహించామని చెప్పారు. ఇప్పటికే బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో శారీ రన్ నిర్వహించామని చెప్పారు. కుటుంబాల కోసం శ్రమించే మహిళలు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించాలన్నదే రన్ ఉద్దేశమన్నారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్