హైదరాబాద్ సిటీ శివారులోని భూములు కొని ఇబ్బంది పడొద్దని హైడ్రా సూచన

హైదరాబాద్ సిటీ శివారులోని భూములు కొని ఇబ్బంది పడొద్దని హైడ్రా సూచన
  • ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు చాన్స్​ లేదు
  • శివారులోని భూముల్లో కొని ఇబ్బంది పడొద్దని హైడ్రా సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు చాన్స్​లేదని, అనుమ‌తి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు ప‌డొద్దని హైడ్రా సూచించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రన‌గ‌ర్ మండ‌లం ల‌క్ష్మీగూడ విలేజ్ స‌ర్వే నంబ‌రు 50లోని 1.02 ఎక‌రాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నార‌ని సోమ‌వారం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ సిటీ ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేస్తూ నోట్​రిలీజ్​చేశారు.

తెలంగాణ మున్సిప‌ల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018 ప్రకారం ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి వీలు లేదన్నారు. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్లపై నిషేదం ఉన్నప్పటికీ..  కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.  జీఓ నంబ‌ర్​131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెల‌సిన అనాథ‌రైజ్డ్ లే ఔట్ల ప్లాట్లలో ఇల్లు నిర్మించ‌డానికి ఎలాంటి అనుముతులు ఇచ్చేది లేద‌ని ప్రభుత్వం స్పష్టం చేస్తోందన్నారు.