
గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో హైడ్రా దూకుడు పెంచింది. నగరంలో పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. శనివారం (ఏప్రిల్ 19) ఉదయం వనస్థలీపురంలో కూల్చివేతలు జరిపిన హైడ్రా.. అదే జోరులో పలు ప్రాంతాల్లో చర్యలు మొదలు పెట్టింది.
మియాపూర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా. వరల్డ్ వన్ స్కూల్ వెనుక ఉన్న అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసింది. అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందిగా గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో.. షెడ్లను జేసీబీల సహాయంతో.. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసింది.
తుర్కయంజాల్ లో..
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్ కాలనీ రోడ్డుపై ఉన్న నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. స్కూప్స్ ఐస్ క్రీమ్ యాజమాన్యం కాలనీ రోడ్డును కబ్జా చేసింది అని కాలనీవాసుల ఫిర్యాదుతో హైడ్రాధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలానికి చెందిన రోడ్డును స్కూప్స్ యాజమాన్యం కబ్జా చేసిందని ఇదే విషయంపై చాలా రోజులుగా పోరాటం చేస్తున్నామన్నారు. హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తమ సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన హైడ్రాధికారులు తమ రోడ్డును తమకు దక్కేలా చేశారన్నారు. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టపాకాయలు పేల్చి హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇది ఇలా ఉండగా హైడ్రా కూల్చివేసిన విధానం కోర్టు ఉల్లంఘనేనని స్కూప్స్ యాజమాన్యం పేర్కొంది. అక్కడ ఉన్నది అనాథరైజ్డ్ లే అవుట్ అని.. తమ భూమి లోకి వచ్చి ప్లాట్లు చేయడంతో తమ భూమిలో తాము నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. హైడ్రా పై కోర్టుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.