3.30 ఎకరాలు ఆక్రమించారు: హైడ్రా కమిషనర్​ రంగనాథ్

3.30 ఎకరాలు ఆక్రమించారు: హైడ్రా కమిషనర్​ రంగనాథ్
  •     నిర్మాణాలకూ ఎలాంటి అనుమతులు లేవు 

హైదరాబాద్​, వెలుగు: ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కలిసి తమ్మిడికుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ తెలిపారు. ఇందులో ఎన్ కన్వెన్షన్ కూడా ఉందని శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. చెరువులోని ఎఫ్​టీఎల్​(ఫుల్​ట్యాంక్​ లెవల్​)లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటలు, మొత్తంగా 3.30 ఎకరాలను ఆక్రమించి, ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టు తమ విచారణలో తేలిందని అన్నారు. ఈ నిర్మాణాలకు సైతం ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించినా, సంబంధిత అధికారులు అనుమతించలేదని రంగనాథ్ వివరించారు. 

‘‘2014లో తమ్మిడికుంట చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి హెచ్ఎండీఏ  ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 2017లో సర్వే నివేదికపై జిల్లా జడ్జి కోర్టు వద్ద  కేసు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. కానీ ఏ కోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు లేవు’’ అని రంగనాథ్​ తెలిపారు. ఆక్రమణల కారణంగా తమ్మిడికుంట చెరువులో నీటి నిల్వ సామర్థ్యం 50 నుంచి -60 శాతం తగ్గిపోయిందని, దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు చెరువు కింది కాలనీలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. కూల్చివేతలు నిలిపేయాలని హైకోర్టు  మధ్యాహ్నం స్టే ఇచ్చిందని, కానీ అప్పటికే అక్కడ కూల్చివేతలు పూర్తయ్యాయయని రంగనాథ్​వెల్లడించారు.