- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
- స్థానికుల ఫిర్యాదుతో కుంట పరిశీలన
హైదరాబాద్ సిటీ, వెలుగు: నానక్‌రామ్‌గూడ చౌరస్తా ఖాజాగూడలోని తౌటోని కుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. చెరువు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు. పరిసర ప్రాంతాల నుంచి చెరువుకు నీరు చేరే మార్గాలను పరిశీలించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీ స్థలంలో నిలుస్తున్న వర్షపు నీరు సమీపంలోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి చేరుతోందని, సమస్యను పరిష్కరించాలని ఇటీవల స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
యూనివర్సిటీ ఖాళీ స్థలంలోని వరదను తౌటోనికుంటకు వెళ్లేలా చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తౌటోనికుంట నిండితే ఆ నీరు నేరుగా భగీరథమ్మ చెరువుకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణపై ఫోకస్పెట్టామని, ముందుగా ఎఫ్‌టీఎల్ నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు.