- హైదరాబాద్‌లో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తం
- అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తం ..
- బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకుపుట్టాలి
- అక్రమ కట్టడాలకు అనుమతులిస్తే ఆఫీసర్లపైనా కేసులు
- చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్ ప్రమాదంలో పడ్తది
- టైమ్ వచ్చినప్పుడు ఎన్- కన్వెన్షన్‌పైనా చర్యలు తప్పవు
- ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు తీసుకోని బిల్డింగ్స్‌ను సీజ్ చేస్తం
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేసిన ప్లాట్లు, కట్టిన ఇండ్లను ఎవరూ కొనొద్దని, వాటిని అమ్మొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అలాంటి అక్రమ నిర్మాణాలను నిర్థాక్షిణ్యంగా కూల్చేస్తామని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి కటకటాలకు పంపుతామని హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తే అధికారుల పైనా కేసులు తప్పవన్నారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకుపుట్టేలా హైడ్రా పనితీరు ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల తక్కువ ధరకే ప్లాట్లు, ఇండ్లు ఇస్తామంటే గుడ్డిగా కొని మోసపోవద్దని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేదో చెక్‌చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని హైడ్రా ఆఫీసులో రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
కబ్జాలపై హైడ్రా పరిధిలో మూడు విడతలుగా చర్యలు ఉంటాయన్నారు. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్రమణల అంతుచూస్తామని చెప్పారు. గ్రేటర్హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఎన్నో చెరువులు కబ్జాకు గురయ్యాని, ఇకపై ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కమిషనర్అభిప్రాయపడ్డారు.
మూడు ఫేజుల్లో హైడ్రా యాక్షన్
హైడ్రా ఆధ్వర్యంలో మూడు విడతల్లో చర్యలు ఉంటాయని రంగనాథ్ వివరించారు. ‘‘ఫేస్–1లో భాగంగా కొత్తగా ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూస్తాం.. కబ్జాదారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం.. ఒకవేళ ఎక్కడైనా కబ్జా జరిగితే హైడ్రా ఉండి కూడా ప్రయోజనం లేనట్టే కదా! రెండో ఫేస్‌లో భాగంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కట్టిన ఇండ్లు, ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేసి కూల్చేస్తాం. ఫేస్–3 లో భాగంగా బెంగళూరు తరహాలో చెరువుల్లో పూడికతీసి పూర్వవైభవం తీసుకొస్తాం..’’ అని ఆయన స్పష్టంచేశారు. కబ్జాలపై హైడ్రా ఆధ్వర్యంలో మూ
కబ్జాలపై హైడ్రా ఆధ్వర్యంలో మూడు విడతల్లో చర్యలు ఉంటాయని రంగనాథ్ వివరించారు. ‘‘ఫేస్–1లో భాగంగా కొత్తగా ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూస్తాం.. కబ్జాదారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం.. ఒకవేళ ఎక్కడైనా కబ్జా జరిగితే హైడ్రా ఉండి కూడా ప్రయోజనం లేనట్టే కదా! రెండో ఫేస్‌లో భాగంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కట్టిన ఇండ్లు, ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేసి కూల్చేస్తాం. ఫేస్–3 లో భాగంగా బెంగళూరు తరహాలో చెరువుల్లో పూడికతీసి పూర్వవైభవం తీసుకొస్తాం..’’ అని ఆయన స్పష్టంచేశారు.
టైమ్ వస్తే ఎన్ - కన్వెన్షన్‌పైనా చర్యలు
గ్రేటర్హైదరాబాద్పరిధిలోని చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులని.. ఒక చెరువు నిండితే, ఆ అలుగునీరు మరో చెరువులోకి వెళ్తుందని.. కానీ కబ్జాల వల్ల ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల భూములు ఆక్రమణలకు గురవడం, అలుగులు, తూములు, నాలాల ద్వారా నీరు పోలేని పరిస్థితి వల్లే 2020లో వరదలు వచ్చాయని, ఆ ఫ్లడ్స్‌తో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అలుగులు, తూములు, నాలాలకు లైన్క్లియర్చేసి గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. చెరువుల పరిరక్షణకు అన్ని విభాగాలతో కలిసి పనిచేస్తామని, సమయం వచ్చినప్పుడు ఎన్ –కన్వెన్షన్‌తో పాటు అలాంటి అన్ని ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు. బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టి తక్కువ ధరకే ఇండ్లు అంటే గుడ్డిగా కొని మోసపోవద్దని, అన్ని రకాలుగా పరిశీలించాకే కొనాలని ప్రజలకు సూచించారు. అలాగే నోటరీ ప్లాట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పర్మిషన్లు తీసుకోని భవనాలను కూడా సీజ్ చేస్తామని, త్వరలో దీనిపై ప్రత్యేక చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.
అనుమతులిచ్చే ఆఫీసర్లపై కూడా..
హైడ్రాకు ప్రస్తుతం రోజూ 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఫిర్యాదులన్నింటిపై విచారణ చేస్తున్నామని.. ఎంక్వైరీ తర్వాత బఫర్, ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మించినట్లు తేలితే కూల్చివేస్తున్నామన్నారు. కొన్నింటికి అధికారులు అనుమతులు ఇచ్చారని, కొన్నింటికైతే ఆక్యుపేషన్ సర్టిఫికెట్(ఓసీ)లు జారీ చేశారని తెలిపారు. చందానగర్‌లో నిరుడు బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని, అక్కడ ఆరు ఫ్లోర్లు నిర్మించారని, ఆ భవన నిర్మాణం పూర్తికాకముందే ఈ ఏడాది మేలోనే ఓసీ కూడా ఇచ్చారని చెప్పారు. దాన్ని ఇల్లీగల్ గా గుర్తించి కూల్చివేశామని ఆయన అన్నారు. నందగిరి హిల్స్ సొసైటీతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పారు. అక్కడ ఉన్న పార్క్ స్థలాన్ని కాపాడేందుకు కూల్చివేతలు చేపట్టామన్నారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు. బఫర్ జోన్ లో అనుమతులిచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించి చర్యలు చేపడ్తామన్నారు. కొన్నింటికి సంబంధించి ఎన్వోసీలు కూడా జారీ అయ్యాయని వాటిపై కూడా విచారిస్తామని ఆయన పేర్కొన్నారు.
చెరువుల్లో60 - 80% కబ్జాలే
హైదరాబాద్ నగరంలోని 56 చెరువులకు సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) 1979 నుంచి 2023 మధ్య స్టడీ చేయగా.. 60 శాతం భూములు కబ్జాలకు గురైనట్లు తేలిందని రంగనాథ్ అన్నారు. మొత్తం 40.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరువులు ఉండగా, ఇందులో 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణకు గురైందని తెలిపారు.
చాలా చెరువులు 60 నుంచి 80 శాతం కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ చెప్పారు. హుస్సేన్ సాగర్ కూడా 21 శాతం ఆక్రమణకు గురైందని, సరూర్ నగర్ చెరువు 56 శాతం కబ్జాల పాలైందన్నారు. తుమ్మలకుంట చెరువు 100 శాతం ఆక్రమణకు గురైందని, పెద్ద చెరువు 96 శాతం, నల్లచెరువు 90 శాతం, మిర్యాల్ గూడ చెరువు 90 శాతం.. ఇట్లా హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులన్నీ కబ్జాల పాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు.
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్
2,500 చదరపు కిలో మీటర్ల పరిధి ఉన్న హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని రంగనాథ్ వెల్లడించారు. ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే ఎస్వోటీ ఏర్పాటు చేసి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెడ్తామన్నారు. హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్టు ఉందని చెప్పారు. పార్క్ స్థలాలను కాపాడే కాలనీ సంఘాలకు మద్దతిస్తామన్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బంది అవసరమని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. హైడ్రా కింద అసెట్ ప్రొటెక్షన్‌తోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్స్‌ను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
మా ముందు పెద్ద టాస్క్ ఉంది.. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఎవరికీ అనుమానం రాకుండా అందులో పేదలను ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నట్లు గుర్తించాం. ఇటీవల గాజులరామారంలో ఇదే తరహాలో 54 ఇండ్లను నిర్మించారు. వాటిని కూడా మేం కూల్చేశాం.
- ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్