- త్వరలోనే పనులు స్టార్ట్ చేస్తం
హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్త పైప్‌లైన్ ఏర్పాటుతో లక్డీకాపూల్ లో వరద సమస్య చెక్‌పడుతుందని హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన ట్రాఫిక్ అడిషనల్కమిషనర్ విశ్వప్రసాద్, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో కలిసి లక్డీకాపూల్ఏరియాను పరిశీలించారు. టెలిఫోన్ భవన్ రూట్లోని ద్వారకా హోటల్ నుంచి మెహిదీపట్నం రూట్లోని లక్కీ రెస్టారెంట్ వరకు ఎయిర్‌టెక్ మెషీన్‌తో మ్యాన్ హోళ్లను పరిశీలించారు. స్ట్రాం వాటర్ పైపులైన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించినా సమస్య పరిష్కారం కాలేదు.
దశాబ్దాల కింద నిర్మించినవి కావడంతో లక్డీకాపూల్మెట్రో పిల్లర్ నంబర్ 1211 వద్ద బ్లాక్ స్ట్రాం వాటర్ పైపులైన్ పూర్తిగా బ్లాక్ అయిందని, లక్డీకాపూల్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వంతెన ముందు భాగంలో పైపులైన్ శిథిలమైందని గుర్తించారు. వాటి స్థానంలో కొత్త పైప్లైన్లు నిర్మించాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడి కొత్త లైన్ల ఏర్పాటుపై రంగనాథ్ చర్చించారు. .
వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఒకటి రెండు రోజుల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. వరద ముప్పు తీవ్రంగా ఉన్న 30 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. లక్డీకాపూల్చౌరస్తాలో 20 ఏండ్లుగా ఇదే సమస్య ఉందని స్థానికులు, దుకాణదారులు రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు.