రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తం: రంగనాథ్

రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తం: రంగనాథ్

హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయట్లేదన్నారు. జీవో 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జులై 19న హైడ్రాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్లానింగ్ కమిషన్, కేబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇలా ఎన్నో అథారిటీలు కూడా జీవోల ద్వారానే ఏర్పాటైనవేనని ఆయన గుర్తుచేశారు. 

హైడ్రా ఏర్పాటు చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో వేసిన పిటిషన్​పై ప్రభుత్వం 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తుందని చెప్పారు. ఆయన శనివారం ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. సెప్టెంబర్​లోనే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తుందన్నారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వం బిల్లు తీసుకురాబోతోందన్నారు. ఆర్డినెన్స్ తర్వాత వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారాలు హైడ్రాకు వస్తాయన్నారు. గ్రేహౌండ్స్, టాస్క్​ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ జాగలను కాపాడటం తమ పని అని రంగనాథ్ అన్నారు.