హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే

హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే
  • డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి: కమిషనర్ రంగనాథ్
  • సామాజిక కార్యకర్తల ముసుగులో వసూళ్లు
  • హైడ్రాను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నరు
  • అలాంటి వారిని జైలుకు పంపుతం
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
  • సంగారెడ్డిలో డబ్బులు వసూలు చేస్తున్న ఫిజియోథెరపిస్ట్ అరెస్ట్

హైదరాబాద్/రామచంద్రాపురం, వెలుగు:హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే వారిని జైలుకు పంపుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను కొందరు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలున్నాయంటూ బుకాయిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బుధవారం ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు.

‘‘కొద్ది రోజులుగా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నరు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్మాణ సంస్థలను బెదిరిస్తున్నరు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో లేదంటే వాటి పరిసరాల్లో బిల్డింగ్​లు నిర్మిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నరు. నిర్మాణాలు అక్రమమంటూ.. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నరు.

హైడ్రా అధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ అబద్ధాలు చెప్తున్నరు. వాళ్లతో దిగిన ఫొటోలు చూపిస్తూ సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికి.. భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నరు. వినకపోతే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని అంటున్నరు. కొన్ని రోజులుగా ఈ దందా నడుస్తున్నట్లు తెలిసింది’’అని ఏవీ రంగనాథ్ అన్నారు.

ఒక్క రూపాయి ఇవ్వొద్దు

డబ్బుల కోసం ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ‘‘రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా డిపార్ట్​మెంట్​కు చెందిన అధికారులు బెదిరించినా.. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్​కెళ్లి కంప్లైంట్ చేయండి. లేదంటే ఎస్పీ, సీపీకి వెళ్లి కలవండి.

ఏసీబీ, హైడ్రా ఆఫీస్​కొచ్చి కూడా కంప్లైంట్ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరు బెదిరించినా ఒక్క రూపాయి ఇవ్వొద్దు. కొందరు హైడ్రా విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నరు. అలాంటి వారిని జైలుకు పంపుతం. ప్రజలను తప్పుదోవ పట్టించే వారితో కఠినంగా వ్యవహరిస్తం’’అని రంగనాథ్ తెలిపారు.

టోల్‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్ 1064కు కాల్‌‌‌‌‌‌‌‌ చేయండి: ఏసీబీ డీజీ

హైడ్రా పేరుతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీస్కుంటామని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని కొంత మంది డబ్బులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. హైడ్రా, ఏసీబీ సహా ఇతర సంస్థల పేర్లతో బెదిరింపులకు పాల్పడితే ఏసీబీ టోల్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నంబర్ 1064 లేదా లోకల్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో డాక్టర్ అరెస్ట్

హైడ్రా పేరు చెప్పుకుంటూ బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ బండ్ల విప్లవ్ సిన్హాను సంగారెడ్డి పోలీసులు అమీన్​పూర్​లో అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఫిజియోథెరపిస్ట్ బండ్ల విప్లవ్ సిన్హా.. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ పరిధిలోని సాయి విల్లాస్ కాలనీలో ఏడేండ్లుగా అద్దెకు ఉంటున్నాడు.

విలాసవంతమైన జీవితం గడపాలని వసూళ్ల దందాకు తెరలేపాడు. అమీన్​పూర్ పరిధిలోని నాన్ లోకల్స్​ను టార్గెట్ చేశాడు. సామాజిక కార్యకర్త అని చెప్పుకుంటూ చెరువులను ఆనుకొని నిర్మాణాలు చేపడ్తున్న వారిని బెదిరించడం మొదలుపెట్టాడు.

ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారంటూ చెప్పేవాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనకు చాలా దగ్గరని, అడిగినన్ని డబ్బులివ్వకపోతే హైడ్రాకు చెప్పి కూల్చి వేయిస్తానని బెదిరించేవాడు. మంత్రులతో కూడా పరిచయాలున్నాయని చెప్పుకుంటూ అందినకాడికి దోచుకునేవాడు. అమీన్​పూర్​లోని ఫ్యూజన్ స్కూల్ వెనుక ఎంసీవోఆర్ అనే నిర్మాణ సంస్థ ఎల్ఎల్​పీ పేరుతో విల్లాలు నిర్మిస్తున్నది.

ప్రాజెక్ట్ బిల్డర్ రాజేందర్​కు ఫోన్ చేసి రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు’’అని ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్​తో దిగిన ఫొటో చూపించి డబ్బులు అడిగినట్లు చెప్పారు. రూ.20లక్షలు డిమాండ్ చేయగా.. రూ.16 లక్షలకు ఫైనల్ చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. సంగారెడ్డి టాస్క్​ఫోర్స్, అమీన్​పూర్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టి మంగళవారం రూ.2లక్షలు అడ్వాన్స్ తీసుకుంటుండగా అతని ఇంట్లోనే విప్లవ్​ను అరెస్ట్​ చేశారు.