- డిజాస్టర్ మేనేజ్ మెంట్ వివరాలు సేకరణ
- మరో రెండ్రోజులు బెంగళూరులోనే రంగనాథ్, హైడ్రా అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు:చెరువులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్‌పై స్టడీ చేసేందుకు హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్, అధికారులు బెంగళూరు వెళ్లారు. గురువారం పలు చెరువులను విజిట్చేశారు. అక్కడి నిపుణులతో సమావేశమయ్యారు. కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను సందర్శించారు. సెన్సార్ సాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలించారు. తర్వాత యలహంక, జక్కూరు చెరువులను పునరుద్ధరించిన తీరును పరిశీలించారు.
మురుగును ఎస్టీపీల ద్వారా ట్రీట్ చేసి చెరువులను నింపుతున్న విధానాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం పనిచేస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. 300 ఎకరాల యలహంక చెరువు, 164 ఎకరాల విస్తీర్ణంలోని జక్కూర్ చెరువులను స్వచ్ఛమైన నీటితో తీర్చిదిద్దుతున్న తీరును పరిశీలించారు. చెరువుల పైభాగంలో కుంటలు ఏర్పాటు చేసి సిల్ట్ నుంచి నీటిని వేరు చేస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు.
‘మేఘ సందేశం’పై అధ్యయనం
వర్ష పాతం, ముంపు ప్రాంతాలు, ట్రాఫిక్ సమాచారం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం డెవలప్‌చేసిన ‘మేఘ సందేశం’ పనితీరును తెలుసుకున్నారు. 20 ఏండ్ల డేటాతో ఎన్ని సెంటీ మీటర్ల వర్షం పడితే వరద ముప్పు ప్రాంతాలను అంచనా వేయడం తదితర సమాచారం తెలసుకున్నారు. వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే వాతావరణ కేంద్రాన్ని పరిశీలించారు. శుక్రవారం లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో రంగనాథ్ సమావేశమవుతారు.
కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం-2014పై చర్చించనున్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించనున్నారు. మరో రెండురోజులపాటు హైడ్రా స్టడీ కొనసాగనుంది. హైడ్రా అధికారులు, రీజినల్ ఫైర్ ఆఫీసర్లు వి పాపయ్య, ఎ.జయప్రకాశ్, ఏఈ నాగరాజు, ఇన్స్పెక్టర్ విజయ్ ఆదిత్య తదితరులు స్టడీటూర్బృందంలో ఉన్నారు.