హైడ్రా అంటే భరోసా.. బాధ్యత.. బూచీ కాదు: రంగనాథ్

హైడ్రా అంటే భరోసా.. బాధ్యత.. బూచీ కాదు: రంగనాథ్

హైదరాబాద్: ఇల్లు కూల్చేస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో నివాసం ఉంటున్న గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ మరణం బాధాకరం అని ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైడ్రాను బూచిగా చూపించడం మానుకోవాలని హితవు పలికారు. పేదలకు భరోసా కల్పించేందుకే హైడ్రా ఉందని, హైడ్రాపై  లేనిపోని భయాలు పెట్టుకోవద్దని సూచించారు.

ALSO READ | HYDRAA: రోజుకు రూ.లక్ష బిజినెస్ చేసే వ్యక్తి బాధితుడిలా చెప్పుకున్నడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రాను భయం, బూచీగా చూపించటం సరైంది కాదని, పేదలు, దిగుమ మధ్య తరగతి వాళ్లకు అన్యాయం చేయాలనే ఉద్దేశం హైడ్రాకు లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువుల్లో కట్టి ఉంటే నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, అయినా నోటీసులు ఇచ్చి మరీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. తగినంత సమయం ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్న వాళ్లు, పేదలు ఉంటే వాళ్ల జోలికి వెళ్లటం లేదని, టైం ఇస్తున్నామని, వాళ్లకు న్యాయం చేసి మరీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 

ALSO READ | మూసీ బాధితులూ.. డోంట్ వర్రీ.. దాన కిషోర్ గుడ్ న్యూస్

పర్మిషన్లు రద్దయిన వాటిని కూడా ఉన్నాయనుకుంటున్నారని, అనుమతి లేకుండా కట్టిన బిల్డర్ ను ప్రశ్నించాలని రంగనాథ్ సూచించారు. నిర్మాణాలకు సర్పంచులు అనుమతివ్వరని, సెక్రటరీ ఇస్తారని ఆయన గుర్తుచేశారు. భూయజమానులకు నోటీసులిచ్చినా.. వాళ్లు లీజుదారులకు చెప్పట్లేదని వివరించారు. చెరువులో ఇండ్లు కట్టుకోవడం ఎవరికీ హక్కు కాదని, పిల్లలు చదువుతున్నారనే మల్లా, పల్లా, ఒవైసీ నిర్మాణాలపై ఆగామని రంగనాథ్ తెలిపారు. పేదలను అడ్డుపెట్టుకొని పెద్దలు తప్పించుకోలేరని హెచ్చరించారు. జన్వాడ తమ పరిధిలోకి రాదని, అక్కడి అధికారులు చూస్తారని చెప్పారు. ప్రజల ఫిర్యాదు ఆధారంగానే కూల్చివేతలు జరుగుతున్నాయని, హైడ్రా సొంత నిర్ణయాలు కాదని మున్సి్పల్ శాఖ ప్రధాన కార్యదర్శి -దానకిశోర్ స్పష్టం చేశారు.