
హైదరాబాద్ సిటీ, వెలుగు: అగ్ని ప్రమాదాల నివారణకు విద్యుత్, ఫైర్, ఇండస్ట్రీ ఇలా ఎవరికి వారు కాకుండా.. ఈ వ్యవస్థలన్ని ఒక ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పని చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్ బిల్డింగ్స్ అనే అంశంపై శనివారం హైడ్రా ఆఫీసులో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాలవల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
సంబంధిత విభాగాలకు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడల్ ఏజెన్సీని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. విద్యుత్ వైరింగ్, ఎర్తింగ్, నాణ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలను వినియోగిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాల్సినవసరం ఉందన్నారు. పరిశ్రమలే కాకుండా అపార్టుమెంట్లు, కార్యాలయాలు, నివాసాలలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించేలా ఈ నోడల్ ఏజెన్సీ చూడాలన్నారు. సదస్సులో హైడ్రా ఫైర్ విభాగం అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, ఎస్‌పీ సుదర్శన్, డిప్యూటీ కలెక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు.