ఎఫ్టీఎల్ లో ఉన్నా.. పర్మిషన్లు ఉంటే.. ఇండ్లను కూల్చము.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్ల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ లో ఇళ్ళు ఉన్నప్పటికీ పర్మిషన్లు ఉంటే ఆ ఇళ్లను కూల్చబోమని అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో మీటింగ్ పెట్టామని.. ఎఫ్టీఎల్ పరిధిని ఎలా నిర్దారణ చేయాలి, చెరువుల సమస్యలు వంటి అంశాలపై చర్చించామని అన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, నాళాల ను ఎలా పునరుద్ధరించాలనే అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నామని వెల్లడించారు రంగనాథ్.

ఈ మీటింగ్ లో  చర్చించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. చెరువులను కాపాడుకోవడానికి ప్రజలను భాగం చేయించాలని.. ఇకనుంచి ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు రాకుండా చూసుకుంటామని అన్నారు. బెంగుళూరు లో చెరువుల పరిరక్షణ బాగుందని..  అక్కడ పర్యటించి అధ్యయనం చేశామని అన్నారు. చెరువుల పునరుద్దరణకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. సర్వే ఆఫ్ ఇండియా, అలుగు హైట్, విలేజ్ మ్యాప్, లేక్ స్ప్రెడ్ డేటా లను పరిగణనలోకి తీసుకుని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తామని వెల్లడించారు రంగనాథ్.

ALSO READ : హైదరాబాద్‎లో ఫుడ్ కల్తీ చేస్తున్నారా..? అయితే ఇక మూడినట్లే..

శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని.. బతుకమ్మ కుంటలో ప్రస్తుతం మిగిలిన ల్యాండ్ లోనే చెరువును డెవలప్ చేస్తున్నామని అన్నారు. కొందరు కోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారని, మేము కోర్టు లో కౌంటర్ వేసి.. కోర్టు ఆర్డర్ వెకేట్ చేయించి త్వరలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు కమిషనర్ రంగనాథ్.