జీడిమెట్ల, వెలుగు: చారిత్రాత్మక జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సుమారు 483 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు పెద్ద ఎత్తున కబ్జాకు గురైందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో భారీ సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. కాగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 15 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆకుల సతీశ్.. హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఫాక్స్ సాగర్ చెరువును రంగనాథ్ పరిశీలించినట్లు తెలిసింది. ఈ చెరువుతో పాటు మైసమ్మగూడలోని చెరువుల్లో వెలసిన నిర్మాణాలను కూడా ఆయన పరిశీలించారు. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి గురించి అధికారులను రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు. మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.