- ఇండ్ల దస్తావేజులు చూసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
ఎల్బీనగర్/ముషీరాబాద్, వెలుగు: కబ్జాకు గురైన ప్రాంతాలను గుర్తించి కూల్చేయాలని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రోడ్లపై అక్రమంగా షెడ్లు నిర్మిస్తే వెంటనే తొలగించాలన్నారు. ఇండ్లకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని చెరువులు, రాంనగర్లోని మణెమ్మ వీధిని రంగనాథ్ బుధవారం పరిశీలించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో కబ్జాకు గురైన చెరువులను మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్ద చెరువు, చంద చెరువు, మంత్రాల చెరువులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు గొలుసుకట్టు చెరువులపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులు ఎక్కడున్నాయో పరిశీలించారు. కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్ని కబ్జాలు గుర్తించారు? అందులో ఎన్ని కూల్చారు? అని అధికారులను ప్రశ్నించారు. మూడు చెరువులు ఎంత మేర కబ్జాకు గురయ్యాయి?.. ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? అనే విషయాలపై మంగళవారం వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
హైడ్రా అధికారులకు రాంనగర్ వాసుల ఫిర్యాదు
ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇండ్లకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి కబ్జాలను వెంటనే కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. రాంనగర్ మణెమ్మ వీధిలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. రోడ్డును ఆక్రమించుకుని నిర్మించిన రాంనగర్ కల్లు కాంపౌండ్, మురుగు నీటి పైప్లైన్లు వేయకుండా అడ్డుకుంటున్న తీరుపై స్థానిక బస్తీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
22 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురికావడంతో బస్తీలోకి అంబులెన్స్ వచ్చే అవకాశం లేదని స్థానికులు వివరించారు. అక్రమంగా వేసిన షెడ్ల కారణంగా పైప్లైన్ ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. వర్షం పడితే ఇండ్లల్లోకి మురుగు నీరు చేరుతున్నదని తెలిపారు. స్పందించిన రంగనాథ్.. అక్రమ కట్టడాలను గుర్తించేందుకు ఇండ్లకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించాలని సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహినుద్దీన్ను ఆయన ఆదేశించారు.