మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని జవహర్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. జవహర్ నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డ్ సమీపంలోని నాలా కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు అనుమతులు ఎవరు ఇచ్చారు అనే విషయంపై ఆరా తీశారు.
ALSO READ | సీఎ రేవంత్ భేష్.. హైడ్రా ఉండాల్సిందే: పవన్ కళ్యాణ్
ఫామ్ హౌస్ లకు అనుమతులు ఇవ్వడం, చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు రంగనాథ్. అనుమతులు లేకుండా నిర్మించిన బడా బాబుల ఫామ్ హౌస్ లతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. పేదలను మినహాయించి బడా బాబులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడం ఖాయమన్నారు. పేదల ఇళ్ల సాకుతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదని ..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రంగనాథ్.