గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో వీలైనప్పుడల్లా ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. లేటెస్ట్ గా మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తుర్కచెరువును సందర్శించారు.
తుర్క చెరువులో ఆక్రమణలతో పాటు కలిషితనీరు కలుస్తుందన్న ఫిర్యాదుతో చెరువును సంబందిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు రంగనాథ్. అనంతరం బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువులో గతంలో అక్రమనిర్మాణాలు కూల్చేసిన సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు రంగనాథ్. ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి పై అధికారులతో చర్చించారు.
61 శాతం చెరువులు కనుమరుగు
గ్రేటర్సిటీ పరిధిలోని చెరువులు 61 శాతం కనుమరుగయ్యాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. మిగిలిన 39 శాతం చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో పట్టణీకరణ కంటే తెలంగాణలో12 శాతం ఎక్కువ ఉందన్నారు.
తెలంగాణలో 47 శాతం పట్టణీకరణ జరిగిందని, 2050 నాటికి 75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో చెరువులను కాపాడుకోలేకపోతే మరో 15 ఏండ్లకు సిటీలో చెరువులు మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా వచ్చాక జనం ఎఫ్టీఎల్, బఫర్, ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకుని ఆస్తులు కొంటున్నారన్నారు.