హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్లో శనివారం (నవంబర్ 9) అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్లాస్టింగ్ జరిగిన తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం (నవంబర్ 11) పరిశీలించారు. పేలుడు ధాటికి హోటల్ వెనుక భాగంలో ఉన్న గది, రెస్టారెంట్ ప్రహరీ కూలి రాళ్లు, ఇనుప రాడ్లు, రేకులు వందమీటర్ల వరకు ఎగరడంతో పేలుడు తీవ్రతను పరిశీలించారు. పేలుడుకి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ALSO READ | ఇక టైమ్ వచ్చింది.. మీ అందరి మద్దతు కోరుతున్నా: సీఎం రేవంత్ రెడ్డి
కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పేలుడు కలకలం రేపింది. 2024, నవంబర్ 9 శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌లోని తెలంగాణ స్పైసీ హోటల్లో పేలుడు సంభవించింది. హోటల్లో వస్తువుల నిల్వ కోసం ఉంచిన రిఫ్రిజిరేటర్లోని కంప్రెసర్ బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి రాళ్ళు ఎగిరి హోటల్ కింది భాగంలో ఉన్న దుర్గా భవానీ నగర్ బస్తీలోని ఇండ్లపై పడ్డాయి. దీంతో నాలుగు ఇండ్లు ధ్వంసం కాగా.. మహిళ, ఓ బాలికకు గాయాలు అయ్యాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానిక బస్తీ వాసులు ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు.