హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే భూ కబ్జాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తిస్తామని.. అక్రమణలకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శనివారం (జనవరి 18) జగద్గిరిగుట్ట వెంకటేశ్వరస్వామి దేవాలయం భూములను కమీషనర్ రంగనాథ్ పరిశీలించారు. దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారని స్థానిక రెవెన్యూ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కబ్జాలకు పాల్పడుతున్న స్థానిక నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవిందరాజుల స్వామి ఆలయం కొలను, గుండం కబ్జా అవుతున్నట్టు పూజారి నరహరి వీడియో చూసి ఇక్కడకు వచ్చామని తెలిపారు. అలాగే ఇక్కడున్న పరికి చెరువు కబ్జాలను కూడా పరిశీలించామని చెప్పారు. కులసంఘాల పేరిట స్థలం కబ్జా చేసి ప్లాట్లు చేసినట్లు కంప్లెయింట్స్ వచ్చాయని.. గూగుల్ మ్యాప్స్ ద్వారా కబ్జాలను గుర్తించి అక్రమణదారులకు నోటీసులు ఇస్తామని తెలిపారు.
ALSO READ |జీహెచ్ఎంసీకి రూ.3,030 కోట్లు.. రిలీజ్ చేసిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ
హైడ్రా పోలీసు స్టేషన్ కూడా 15 రోజుల్లో పని ప్రారంభిస్తుందని.. కబ్జాదారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కబ్జాలపై నిర్లక్ష్యం వహించిన స్థానిక అధికారులపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు. వచ్చే బుధవారం జగద్గిరిగుట్ట ఆలయ భూములతో పాటు పరికి చెరువు కబ్జాలపై స్థానికులతో హైడ్రా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2024 జూలైలో హైడ్రా ఏర్పాటు అయిందని.. అంతకుముందు నిర్మించిన నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. 2024 జూలై తర్వాత జరిగిన కబ్జాలపై మాత్రమే హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.