చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్​జోన్​ నిర్ధారిస్తం.. చెరువుల్లో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్​

  • అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత వాడుతున్నం
  • రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, నిపుణులతో  మీటింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారిస్తామని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యం అని చెప్పారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ఎఫ్టీఎల్, బఫర్​ జోన్​ నిర్ధారణ, వరద నీటి కాలువల పరిరక్షణ అంశాలపై  శుక్రవారం బుద్ధభవన్ లోని హైడ్రా ఆఫీసులో నిపుణులతో కమిషనర్  ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు.  చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్​జోన్​ ఎలా నిర్ధారించాలి?  అనేదానిపై  రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో మీటింగ్ పెట్టామని చెప్పారు.  చెరువుల సమస్యలపై చర్చించామన్నారు.  ఇక్కడ చర్చించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని రంగనాథ్​ చెప్పారు. 

ఎఫ్​టీఎల్​ లెవెల్​ పరిగణనలోకి తీసుకొని సర్వే

అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయని రంగనాథ్​ తెలిపారు. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ లెవెల్ పరిగణనలోకి తీసుకొని చెరువులు సర్వే చేయిస్తామని, తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసిందని చెప్పారు. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు.. పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదని, కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికీ తెలిసిందని అన్నారు. ప్రజల్లో ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌, బఫర్ జోన్లపై అవగాహన వచ్చిందని,  దీనిపై చర్చ కూడా జరుగుతున్నదని తెలిపారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని, కొన్నిసార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తున్నదని చెప్పారు.

బెంగళూరు లో చెరువుల పరిరక్షణ బాగుందని, అక్కడ పర్యటించి అధ్యయనం చేశామని తెలిపారు. పూర్తిస్థాయి నీటి మట్టాలను పరిగణనలోకి తీసుకొని కర్నాటకలో చెరువులకు హద్దులు నిర్ధారిస్తున్నారని,  ఆ ప్రకారం ఆక్రమణలుంటే తొలగిస్తున్నారని చెప్పారు. శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, బతుకమ్మకుంటలో ప్రస్తుతం మిగిలిన ల్యాండ్ లోనే చెరువును డెవలప్ చేస్తున్నామని తెలిపారు.  కొందరు కోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారని,  కోర్టులో కౌంటర్ వేసి ఆర్డర్ వెకేట్ చేయించి త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు.