అసలైన లబ్ధిదారులు ఎవరనేది తేలుస్తాం : హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​

అసలైన లబ్ధిదారులు ఎవరనేది తేలుస్తాం : హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని​ రాజగోపాల్ నగర్​ లే ఔట్​సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ తెలిపారు. అన్ని అంశాలను పరిగనలోకి తీసుకొని, పారదర్శక విచారణ చేసి అసలైన లబ్ధిదారులు ఎవరనేదీ తేలుస్తామన్నారు. శుక్రవారం అమీన్​పూర్​లోని ఐలాపూర్, వెంకటరమణ కాలనీలను అధికారులతో కలిసి పరిశీలించారు.

తమ ప్లాట్లు కబ్జా అయ్యాయంటూ ఇటీవల హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా టీమ్​ స్థానికులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రంగనాథ్​ మాట్లాడుతూ..ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను కాపాడడం కోసమే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని, త్వరలోనే హైడ్రా పోలీస్​ స్టేషన్​ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తమ టీమ్​ క్షుణ్ణంగా విచారిస్తుందని, అన్ని లీగల్ అంశాలపై లోతైన విచారణ జరుపుతామని చెప్పారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా సర్వే ఆఫ్​ ఇండియా, ఏడీ సర్వేలు అందరి సమక్షంలోనే జరుగుతాయన్నారు. ఐలాపూర్​ రాజగోపాల్ నగర్​ విషయంలో కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామని, అందరినీ పిలిపించి విచారణ చేస్తామని తెలిపారు. 

రంగనాథ్​తో గొడవకు దిగిన న్యాయవాది 

రాజగోపాల్ నగర్​ లే ఔట్​ఫిర్యాదులపై ఐలాపూర్​ వచ్చిన హైడ్రా కమిషనర్​ రంగనాథ్​తో గ్రామస్తుడు, న్యాయవాది ముఖీం గొడవకు దిగారు. వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుంటే మీరెలా విచారణకు వస్తారని ప్రశ్నించారు.

గ్రామస్తుల తరుపున చాలా ఏళ్లుగా న్యాయస్థానంలో పోరాడుతున్నానని, ఇటీవల హైడ్రా వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. బాధితుల సమస్యలు వినడానికి మాత్రమే వచ్చామని మీ వివరణ కూడా తీసుకుంటామని రంగనాథ్​ వారికి సర్ధి చెప్పారు.