హైడ్రా ప్రజావాణికి మంచి రెస్పాన్స్ వచ్చింది.. సోమవారం ( జనవరి 20, 2025 ) నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 89 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.క్షేత్ర స్థాయిలో ఫిర్యాదులపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు రంగనాథ్. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఎక్కువగా వచ్చిన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు కమిషనర్. అమీన్‌పూర్ చుట్టూ అనేక ఫిర్యాదులు వస్తున్న క్రమంలో అమీన్ పూర్ పరిధిలో పూర్తి స్థాయి సర్వే చేస్తామని తెలిపారు రంగనాథ్.
దీంతో పాటు నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని మేడికుంట చెరువు 45 ఎకరల పరిధిలో ఉండేదని.. కబ్జాలు జరిగి చెరువు కుంచించుకుపోయిందని కమీషనర్ కు ఫిర్యాదు చేశారు వృద్ధ దంపతులు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని డిఫెన్స్ కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన వెయ్యి గజాల స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధి కబ్జా చేసినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.
మూసాపేటలోని ఆంజనేయనగర్ లో 2 వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురి అవుతోందని.. అడ్డుకున్న తమపై దాడికి దిగుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణతోనే సమస్యలకు పరిష్కరిస్తామని.. నాలుగైదు నెలల్లో ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్దారణ పూర్తి చేస్తామని తెలిపారు కమిషనర్ రంగనాథ్.