- హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: అనుమతులు లేకుండా వాణిజ్య, వ్యాపార కట్టడాలను ఎప్పుడు నిర్మించినా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎన్ కన్వెన్షన్ మాదిరిగా కూల్చివేస్తామని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. గతంలో అనుమతులిచ్చి తర్వాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలేనన్నారు. అవి ఎటువంటి నిర్మాణాలైనా జులై తర్వాత జరుగుతుంటే అక్రమ కట్టడాలుగా పరిగణిస్తామన్నారు. కత్వా చెరువు, మల్లంపేట, అమీన్ పూర్ లో కూల్చివేతలు ఈ కేటగిరీలోకే వస్తాయన్నారు. పేదలను ముందు పెట్టి తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. చింతల చెరువు, గాజులరామారం, మాదాపూర్ సున్నం చెరువుల్లోని కూల్చివేతలు ఈ కేటగిరీకి చెందినవేన్నారు. కోర్టు ఉత్తర్వులుంటే ఎలాంటి కట్టడాలైనా కూల్చడం జరుగుతుందని, నిజాంపేట ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల కూల్చివేత ఇదే తరహాలో ఉన్నవేనన్నారు. ఎఫ్ టీల్ లోని నిర్మాణాలను కూల్చక తప్పదని, అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా బాధ్యులు అవుతారని హెచ్చరించారు. నగరంలో చెరువుల ఎఫ్ టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్ కు సంబంధించి మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టిందని, త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 5వేలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ను ఆఫీసర్లే మార్చేసిన్రు
ఉస్మాన్ సాగర్ లేక్ ఎఫ్టీఎల్ ను ఇరిగేషన్ అధికారులు మ్యానిపులేట్ చేసినట్లు హైడ్రా గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ ఎస్ఈ, ఇద్దరు ఈఈలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. ఉస్మాన్ సాగర్ లేక్ ఎఫ్టీఎల్ ను మార్చి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా చేశారన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్పరిధిని ఫైనల్ చేస్తున్నామన్నారు.