హైదరాబాద్ సిటీ, వెలుగు: కొద్ది నెలల్లోనే అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసి, బౌండరీలు వేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గడిచిన వంద రోజుల్లో హైడ్రా ఎంతో సాధించిందని, అక్రమార్కులకు సింహస్వప్నంగా మారడంతోపాటు సామాన్యులకు భరోసా ఇచ్చిందని పేర్కొన్నారు. హైడ్రా పేరు చెప్తేనే ఆక్రమణదారుల్లో వణుపు పుడుతున్నదని అన్నారు. అదే సమయంలో చెరువుల జాగాలు, ప్రభుత్వ స్థలాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని, అన్నీ చెక్చేసుకున్నాకే ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. హైడ్రా సైలెంట్ అయిందనే వాదనలో వాస్తవం లేదని, అంతకు రెట్టింపు బలోపేతమవుతున్నదని చెప్పారు. ఇకపై పక్కా ప్లాన్, అన్ని ఆధారాలతో ముందడుగు వేస్తామని తెలిపారు. హైడ్రా ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం రంగనాథ్ ‘వెలుగు’ తో ముచ్చటించారు.
త్వరలో చెరువుల బౌండరీలు ఫైనల్
హైడ్రా పరిధిలో 549 చెరువులు ఉంటే, ఇప్పటికే 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్, 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశాం. కొద్ది నెలల్లోనే అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసి బౌండరీలు వేస్తాం. ఈ మేరకు చెరువులకు సంబంధించిన శాటిలైట్ మ్యాప్ లను పరిశీలిస్తున్నాం. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) తో ఒప్పందం చేసుకుంటున్నాం. ఫ్యూచర్ లో డెయిలీ శాటిలైట్ మ్యాప్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోబోతున్నాం.
ఇతర రాష్ట్రాల్లోనూ హైడ్రా కావాలంటున్నరు
హైడ్రా వచ్చాక ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇటీవల బెంగళూరు, చెన్నై సిటీల్లో వరదల సమయంలో ఆయా చోట్ల సోషల్ మీడియా వేదికగా జనం హైడ్రా కోసం డిమాండ్ చేశారు. భవిష్యత్తు తరాల కోసం హైడ్రా కావాలని స్టూడెంట్స్ అంటున్నారు. మా వద్దకు చాలా మంది విద్యార్థులు వచ్చి హైడ్రా గురించి, వివిధ అంశాలపై స్టడీ చేస్తున్నారు.
నాలాలపై కూడా సర్వే చేస్తున్నాం
నగరంలోని నాలాలు, రోడ్లపై వివరాలు తీసుకుంటున్నాం. నాలాలు ఆక్రమించడం వల్ల వరద నీరు సాఫీగా పోవట్లేదు. రోడ్ల ఆక్రమణల వద్ద కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. వీటిపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చిస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కి సంబంధించి కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్
హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నది. హైడ్రా కు కావాల్సిన అధికారులు, సిబ్బందితో పాటు ఫండ్స్ కేటాయించారు. హైడ్రాకు మొత్తం 2,500 మంది అవసరం. ఇందులో 2 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాగా, 500 మంది అధికారులు. త్వరలో అన్ని పోస్టులు భర్తీచేస్తం. అలాగే హైడ్రాకు ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లను కేటాయించింది. కొద్దిరోజుల్లోనే హైడ్రా కార్యాలయాలన్నీ అందుబాటులోకి వస్తాయి.
ఇక కటాఫ్
డేట్తర్వాత ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టనివ్వం. అనుమతులు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా తమ వ్యాపారం చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొన్న జనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నగరంలో రియల్ వ్యాపారంపై ఆధారపడి 12 లక్షల మంది జీవిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో వారికి ఇబ్బందిగా మారింది.
ఇప్పటి వరకూ 111 ఎకరాల భూమిని కాపాడినం చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనే కాకుండా పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్ లు, తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణలపైనా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జూలై 19న జీవో విడుదల చేసింది. ఈ వంద రోజుల్లో 262 ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ కూల్చివేతల ద్వారా 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడగలిగాం.
హైడ్రాపై తప్పుడు ప్రచారాలు
సోషల్ మీడియా వేదికగా హైడ్రాపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రాతో పేదలు రోడ్డున పడుతున్నారని, హైడ్రా వల్ల రియల్ వ్యాపారం దెబ్బతింటున్నదని చెప్తున్నారు. అలాంటి వారికి మేం చేస్తున్న మంచి పనులే సమాధానం చెప్తాయి. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి ఎవరూ భయపడొద్దు. ఇందుకు సంబంధించి త్వరలో కటాఫ్ డేట్ ఇస్తాం. ఆ తేదీకి ముందు నిర్మించిన రెసిడెన్షియల్ నిర్మాణాలను మేం కూల్చం. అవి బఫర్, ఎఫ్టీఎల్లో ఉన్నా సరే భయపడాల్సిన పనిలేదు. కానీ కమర్షియల్ నిర్మాణాలను మాత్రం వదిలే ప్రసక్తిలేదు.
డెబ్రిస్ తీసే బాధ్యత బిల్డర్లదే
ఎర్రకుంట చెరువులో కూల్చేసిన నిర్మాణాల ఐరన్ ను హైడ్రా అమ్ముకుంటున్నదని వచ్చిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎర్రకుంట చెరువులో నిర్మించిన భవనాల వ్యర్థాలను తొలగించాలని సదరు బిల్డర్ సుధాకర్ రెడ్డికి గతంలో నోటీసులు జారీ చేశామని తెలిపారు. బిల్డర్ అక్కడ ఉన్న ఐరన్ తీసుకొని, డెబ్రిస్ వదిలేసి వెళ్లాడని, ఆ డెబ్రిస్ తరలించడానికి ఖర్చు ఎంతైనా బిల్డరే చెల్లించాలని అన్నారు. పిల్లర్ల మధ్యన ఉన్న ఇనుప చువ్వలను తొలగించి వాటిని అమ్మగా వచ్చింది పోను డెబ్రిస్ తీయడానికి అయిన ఖర్చు బిల్డర్ నుంచి వసూలు చేస్తామని చెప్పారు. హైడ్రా కూల్చిన తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలని, లేకుంటే వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.