- చెరువుల్లో కట్టుకొని కోర్టుకెళ్తామంటే కుదురదు
- నోటీసుల జారీ ఉండదు.. అక్రమమైతే కూల్చుడే!
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
- ఏపీ మాజీ సీఎం జగన్ కు నోటీసులివ్వలేదని క్లారిటీ
- 13 చెరువుల్లో 1,100 భవనాలు.. నోటీసులు ఇచ్చిన రెవెన్యూ
- అప్పా చెరువులో కొనసాగుతున్న కూల్చివేతలు
- ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం
హైదరాబాద్: చెరువుల్లో అక్రమంగా భవనాలు నిర్మించుకొని కోర్టు కెళ్తామంటే కుదురదని, రెండు గంట్లో కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. స్టేలు తెచ్చుకునేందుకు టైం ఇవ్వమని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య అప్పా, మామిడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగించారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు. హైదరాబాద్‌లోని జగన్ లోటస్ పాండ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని.. త్వరలోనే హైడ్రా లోటస్ పాండ్‌ను కూల్చేస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపైనా రంగనాథ్ స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఇట్లాంటి నోటీసులు ఇవ్వదని.. అక్రమణ అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తోందని అన్నారు.
2 జిల్లాలు.. 13 చెరువులు.. 1,100 అక్రమ నిర్మాణాలు
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 13 చెరువుల్లో 1,100 భవనాలు నిర్మించుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వాళ్లకు గతంలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో 462 ఎఫ్టీఎల్ లో, 634 బఫర్ జోన్లో ఉన్నాయి. ఈ నోటీసుల్లో దుర్గం చెరువును ఆక్రమించి నిర్మించిన 204 భవనాలు కూడా ఉండటం గమనార్హం. శతాబ్దాల చరిత్ర కలిగిన హస్మత్ పేట బోయిని చెరువులో 148 భవనాలు ఎఫ్టీఎల్ లో ఉన్నాయి. ఎక్కువగా అక్రమణలు జరిగిన చెరువుల జాబితాల్లో మొదటి స్థానంలో ఉంది. ఓల్డ్ అల్వాల్ లోని చిన్నరాయని చెరువులో105 అక్రమ నిర్మాణాలున్నట్టు హైడ్రా గుర్తించింది.
ఇది సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కూకట్ పల్లిలోని సున్నం చెరువు, నానక్ రాంగూడలోని సున్నం చెరువు, గౌలిగూడలోని గోసాయికుంట, చందానగర్ పెద్ద చెరువు, నల్లగండ్ల చెరువు, మాదాపూర్ లోని దుర్గం చెరువు, సరూర్ నగర్ లోని మద్దెల కుంట, పీర్జాదిగూడలోని పెద్ద చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, దుండిగల్ లోని చిన్న దామెర చెరువు, కూకట్ పల్లిలోని అంబీర్ చెరువు, చిన్నరాయని చెరువు, బోయిని చెరువుల్లో భారీగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నల్ల చెరువు, దామెర చెరువు పరిరక్షణకు సీసీ టీవీ కెమెరాలు లేవని, కొన్నిచెరువుల రక్షణ చూసే బాధ్యులే లేరని తేలింది. 160, 80 ఎకరాల విస్తీర్ణమున్న చెరువులు కూడా ఒకరిద్దరి రక్షణలోనే కొనసాగుతున్నాయని నిర్ధారణ అయ్యింది. హస్మత్ పేట బోయిని చెరువు చెత్తతో నిండిపోయిందని, ఇందులోకి మురుగునీరు వదులుతున్నారని తేలింది.