
మిర్యాలగూడ, వెలుగు: ప్రణయ్ హత్య కేసులో నిజం గెలవడం కోసం ఆనాడు తాము అనేక నిందలు మోశామని హైడ్రా కమిషనర్, నాటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో వృత్తిపరమైన సంతృప్తి కలిగిందని చెప్పారు. ప్రణయ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి డీఎస్పీ, ప్రస్తుత విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌ను రంగనాథ్ సోమవారం అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2018 సెప్టెంబర్ 14న జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాం. వాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినం. 9 నెలలు కష్టపడి 1,600 పేజీల చార్జ్‌షీట్ సిద్ధం చేసి కోర్టుకు అందజేసినం. ఎక్కడా ఎలాంటి పొరపాటు లేకుండా, నిందితులు శిక్ష నుంచి తప్పించుకోకుండా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చార్జ్‌షీట్ ఫైల్ చేశాం. ఈ కేసు విచారణలో అప్పటి మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ సమర్థవంతంగా పని చేయడంతోనే ఇప్పుడు నేరస్తులకు శిక్ష పడింది” అని అన్నారు.