సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా పర్యటించారు. అమీన్ పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు పర్యటించామని తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని, చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు మేరకు పరిశీలించామన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కబ్జా పై ఫిర్యాదు వచ్చిందని సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇదే కాలనీకి ఆనుకుని ఉన్న హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ లో పార్కు కబ్జా అయినట్లు తెలిసిందన్నారు.
శంభునికుంట చెరువు రెండు భాగాలుగా విభజించబడిందని ఎఫ్ టీ ఎల్ లో భవనాలు నిర్మించారని, వీటిపై ఎన్ జీ టీ లో కేసులున్నాయని వీటిపై కూలంకుశంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వెంకట రమణ కాలనీ లో గోల్డెన్ కీ వారు పార్కు స్థలాలను కబ్జా చేశారని హైడ్రా అధికారులు ఇది వరకే సర్వే చేశారని, మరో సారి పరిశీలించి పార్కులు, ఓపెన్ స్థలం కబ్జా అయినట్లు నిర్థారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా ప్రధాన ఉద్దేశ్యం చెరువుల పునరుద్ధరణ, రోడ్లను, పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడమన్నారు.