- చెరువులు, కుంటలను పరిశీలించిన రంగనాథ్
- సాకి చెరువులో 18 అక్రమ కట్టడాల గుర్తింపు
- ఏపీ మాజీ సీఎం జగన్‌కు నోటీసులు ఇవ్వలేదని వెల్లడి
సంగారెడ్డి, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. అమీన్పూర్ మండలం వెంకటరమణ కాలనీ, హెచ్ఎంటీ స్వరపురి కాలనీ, పెద్ద చెరువు, పటాన్‌చెరులోని సాకి చెరువు, శంబునికుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులు, కుంటల స్థలాల కబ్జాల గురించి ఆరా తీసి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు.
మాదాపూర్ ఖానామెట్‌లో ఈదులకుంట చెరువు, కూకట్ పల్లి సున్నం చెరువు, దుండిగల్‌లో ఓ నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి అక్కడ పర్యటించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలతోపాటు పార్కు, నాలా స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని గుర్తించారు. విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. నివేదిక అనంతరం ఆక్రమణలను కూల్చివేయనున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.
అక్రమ నిర్మాణాల గుర్తింపు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలనలో కొన్ని అక్రమ నిర్మాణాలు బయటపడ్డాయి. సాకి చెరువులో తూములు మూసేసి ఇన్కార్ సంస్థ అపార్ట్ మెంట్ కట్టినట్టు ఫిర్యాదులు అందగా, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. ఈ చెరువు ఎఫ్టీఎల్విస్తీర్ణం 135 ఎకరాలు ఉండగా, పదుల ఎకరాల్లో చెరువు కబ్జాకు గురైనట్టు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికంగా ప్రవహించే నక్కవాగు బఫర్ జోన్లో బహుళ అంతస్తుల నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయా నిర్మాణాలపై దృష్టి సారించిన రంగనాథ్,వాటిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
జగన్‌కు నోటీసులు ఇవ్వలేదు
ఏపీ మాజీ సీఎం జగన్‌కు నోటీసుల ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. జగన్ ఇంటికి నోటీసులు పంపినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్న ఆయన.. తాము ఎలాంటి నోటీసులివ్వలేదని స్పష్టం చేశారు. అమీన్పూర్ సాకి చెరువులో 18 అక్రమ నిర్మాణాలు జరిగినట్టు గుర్తించామని తెలిపారు.
అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపిస్తున్నట్టు తెలిపారు. ఆక్రమణలపై ఈ ప్రాంతవాసులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని రంగనాథ్ వెల్లడించారు.
బిల్డర్లపైనా కేసులు పెడ్తం: రంగనాథ్
‘‘చెరువులు, నాలాలు, పార్కు తదితర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే ఎప్పుడైనా కూల్చేస్తాం. డబ్బులు ఉన్నాయని కొందరు పేరున్న అడ్వొకేట్లను పెట్టుకొని స్టే తెచ్చుకుందామని అనుకుంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో గనుక ఆక్రమణలు ఉంటే ఎటువంటి ఆటలు సాగవు” అని బిల్డర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఇటీవల ఓ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ‘‘నిజాయితీగా ఇండ్లను నిర్మించి బిజినెస్ చేసుకుంటే మీకు అందరి సహకారం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవు.
కోర్టుకెళ్లి ఏదో రూపంలో స్టే తెచ్చకొని కూల్చివేతలను ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టే తెచ్చుకునేందుకు సమయం ఇవ్వకుండానే కూల్చివేతలు చేస్తున్నాం. హైడ్రా ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు కూల్చివేస్తందో కూడా తెలియదు. అడ్డదారిలో అనుమతులు పొంది సర్కారు స్థలాల్లో నిర్మాణాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. భవనాలు కూల్చడమే కాకుండా కేసులు కూడా పెడతాం. ఆ తరువాత జైలుకు పోవాల్సి వస్తుంది. దీనివల్ల బిల్డర్ లాస్ అవడంతో పాటు పేరు కూడా పోతుంది” అని అన్నారు. అందుకే అందరూ నిజాయితీగా బిజినెస్ చేసుకోవాలని సూచించారు. హైడ్రా పరిధిలో ఉన్న బిల్డర్లందరితో సమావేశమవుతానని చెప్పారు.