ఇప్పటికే 61 పర్సెంట్ ఖతం.. ఇక మిగిలింది 39 శాతమే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఇప్పటికే 61 పర్సెంట్ ఖతం.. ఇక మిగిలింది 39 శాతమే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న క్రమంలో పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం (నవంబర్ 26) సీఎస్ఐర్ ఆధ్వర్యంలో అర్బన్ లేక్ మేనేజ్మెంట్ అనే అంశంపై బేగంపేట్‎లోని ప‌ర్యాట‌క భ‌వ‌న్‌లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. 

భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, మెరుగైన జీవనాన్ని అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం, చెరువుల పరిరక్షణ, ప్రజావసరాల కోసం కేటాయించిన పార్కులను, రహదారులు క‌బ్జాల‌కు గురికాకుండా కాపాడడమే హైడ్రా ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. 

ALSO READ | నిర్మాణంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్ .. 7 నెలలుగా నిద్ర లేకుండా చేసిండ్రు

హైదరాబాద్ నగరంలో 61 శాతం చెరువులు ఇప్పటికే కనుమరుగయ్యాయని.. ఇంకా మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయి,  చెరువుల విస్తీర్ణం ఎంత అనే దానితో పాటు  చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పనిని హైడ్రా చేపట్టిందని తెలిపారు. గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ దెబ్బ తినడం వల్లే  నగరంలో 2 సెంటీ మీటర్ల వర్షం ప‌డినా రహదారులు నీట మునుగుతున్నాయని పేర్కొన్నారు.