- అన్ని అనుమతులున్న భవనాలను టచ్‌కూడా చేయట్లే: రంగనాథ్
- హైడ్రాను కొందరు బూచిగా చూపిస్తున్నరు
- బఫర్ జోన్లలో నిర్మాణాలు కూల్చట్లే
- పెద్దల ఆక్రమణలు కూల్చేందుకే మా మొదటి ప్రాధాన్యత
- హైడ్రా సైలెంట్‌గా ఉందంటే గ్రౌండ్‌వర్క్ జరుగుతున్నట్టేనని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు:హైదరాబాద్నగరానికి హైడ్రా ఒక భరోసా అని, దీన్ని ఒక బూచిగా చూపించొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలంటే మన చెరువులను, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాలని, ఇందుకోసమే హైడ్రా పనిచేస్తున్నదని తెలిపారు. శనివారం సెక్రటేరియెట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రంగనాథ్మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా నగర ప్రజలకు మెరుగైన జీవనం కల్పించే బాధ్యతాయుతమైన పాత్రను హైడ్రా పోషిస్తున్నదని చెప్పారు.
ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించే హక్కును కాపాడడమే తమ కర్తవ్యమని తెలిపారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారని పేర్కొన్నారు. ‘హైడ్రా సైలెంట్ గా ఉందని కొందరు అంటున్నారు. కానీ హైడ్రా సైలెంట్‌గా ఏమీ లేదు..హైడ్రా సైలెంట్ అయిందంటే ఏదో గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు భావించాలి’’ అని అన్నారు. ధనవంతుల ఇండ్లు, ఫాం హౌస్‌లు, కట్టడాల జోలికి వెళ్లడంలేదనేది వాస్తవం కాదని, వారి ఆక్రమణల కూల్చివేతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
111 జీవో లో ఉన్నందున జన్వాడ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఓర్ఆర్ఆర్ పరిధిలో 565 చెరువులను గుర్తించామని, ఇందులో 136 చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ గుర్తించడం పూర్తయిందని, మిగతావి కూడా గుర్తించాక అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతానికి ఎవరికైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు.
బుచ్చమ్మ ఆత్మహత్య కలిచివేసింది
కూకట్‌పల్లి చెరువు వద్ద ఎలాంటి ఇండ్లను హైడ్రా కూల్చలేదని, అక్కడ బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. ‘ఇల్లు కూలుస్తారని ఎవరో భయభ్రాంతులకు గురిచేయడం వల్లే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. మేం బఫర్‌జోన్‌లో ఉన్న ఇండ్ల జోలికి వెళ్లలేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు’ అని భరోసా ఇచ్చారు.
ప్రకృతిని విధ్వంసం చేసి జీవన ప్రమాణాలు దెబ్బతీసేవారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి భవనాలపై ఫిర్యాదులు వచ్చాయని, కేవలం అందులో చదువుతున్న విద్యార్థుల కోసం మాత్రమే ప్రస్తుతం కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. అకడమిక్ ఇయర్ మధ్యలో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతారని, అందుకే ఆగామని వివరించారు. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదని చెప్పారు.
ప్రభుత్వ స్థలాలతోపాటు కాలనీలు, ముఖ్యమైన లే ఔట్లు, నివాస ప్రాంతాల్లోని ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, పాఠశాలలకు కేటాయించిన స్థలాలు కాపాడడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
మీడియా సహకరించాలి
హైడ్రాకు మీడియా సహకరించాలని రంగనాథ్విజ్ఞప్తిచేశారు. అనుమతులు లేనివాటినే హైడ్రా కూల్చుతోందని, హైడ్రా పరిధిలో లేని కూల్చివేతలు కూడా సోషల్‌మీడియాలో చూపించి ప్రజలను భయపెట్టడం తగదని అన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులున్న ఇళ్లను కూల్చడంలేదని, అలాగే పేదలు నివాసం ఉంటే వాటిని కూల్చేయడంలేదని చెప్పారు. అమీన్‌పురా చెరువు సమీపంలో సర్వే నంబర్ 6కు ఉన్న అనుమతులను చూపుతూ సర్వే నంబర్12లో ఇండ్లు నిర్మించారని, ఈ అంశంలో అక్కడ గ్రామ కార్యదర్శి, ఆర్ఐ ఇదివరకే సస్పెండ్ అయ్యారని తెలిపారు.
రిజిస్ట్రేషన్లు ఆగిపోతే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చి అక్కడ నిర్మాణ, రియల్ సంస్థలు నివాసితులను తప్పుదోవ పట్టించి, ఇండ్లు అమ్ముకున్నాయని వివరించారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని చెప్పారు. ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్న గుడిసెలను తొలగించలేదని, కొందరు అక్రమంగా బిజినెస్ లు చేస్తూ.. హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
కట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చామని చెప్పారు. కానీ కొందరు సీరియస్‌గా తీసుకోలేదని, అయినప్పటికీ వారిని ఖాళీ చేయించిన తర్వాతే కూల్చివేతలు స్టార్ట్ చేశామని వెల్లడించారు. ఇండ్లు కొనే ముందు అన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలని ప్రజలను కోరుతున్నామని, లేకపోతే ఆక్రమణ దారుల చేతిలో మోసపోవాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే లోన్లు మంజూరు చేయాలని, ఈ విషయంలో అమాయక ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఫ్యూచర్లో వరదలు వస్తే అందరం మునుగుతం
అక్రమార్కులను వదిలేస్తే హైదరాబాద్ నగరంలో కోటి మందికి ముంపు ముప్పు పొంచి ఉంటుందని రంగనాథ్ తెలిపారు. రోజుకు రూ.లక్ష బిజినెస్ చేసే వ్యక్తి కూడా తానేదో బాధితుడిలా చెప్పుకున్నాడని, హైడ్రా బాధితులు పేదలు కాదని, అక్రమాలు చేసినవాళ్లేనని స్పష్టంచేశారు. ‘‘ఇప్పటికే చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో వరదలు వస్తే కాలనీలు నీటమునుగుతాయి.
రోడ్లపై నీరు చేరి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తుంది. అప్పుడు అందరూ భాధితులు అవుతారు” అని అన్నారు. సరైన అనుమతులు ఉన్న భవనాలను తాము టచ్ కూడా చేయలేదని చెప్పారు. ముందస్తుగా సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా.. ఆక్రమణలు కూల్చాక సమాచారం ఇవ్వలేదంటున్నారని కమిషనర్రంగనాథ్చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, చెరువు బఫర్ జోన్లలో భవనాలు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నవారిని ముందు ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు.
స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రయాణం, నివాసం కల్పించాలనేదే హైడ్రా లక్ష్యమని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పై ఉంటుందని అన్నారు.