ప్రభుత్వ భూములే కాదు.. పార్కు స్థలాలను కాపాడే పనిలో హైడ్రా నిమగ్నమైంది. అమీన్‌పురా మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ అనుమతులిచ్చిన లేఔట్లలో పార్కుల కబ్జాపై పలు ఫిర్యాదులందడంతో సమగ్ర సర్వేకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అమీన్‌పురా మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 152, 153లో హుడా అనుమతి పొందిన వెంకటరమణా కాలనీలో పార్కుల స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించింది. బుధవారం సర్వే నిర్వహించింది. హైడ్రా అధికారులతో పాటు ఈ సర్వేలో రెవెన్యూ అధికారులు, హెచ్ ఎండీఏ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ALSO READ | హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటా... కేటీఆర్
కబ్జా చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో పాటు.. ఫిర్యాదు చేసిన కాలనీవాసులతో సమావేశాన్ని కూడా హైడ్రా కమిషనర్ ఏర్పాటు చేశారు. హెచ్ ఎండీఏ అనుమతి పొందిన లే ఔట్లో పార్కు స్థలాలతో పాటు తమ ఇంటి స్థలాలు కబ్జాకు గురయ్యాయని సంబంధిత శాఖల అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా కనీసం స్పందించలేదని.. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి సర్వే చేయడాన్ని ఆయా లేఔట్లలోని ప్లాట్ ఓనర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
బాధితులతో హైడ్రా కమిషనర్ సమావేశం..
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించే క్రమంలో ఇటీవల అమీన్‌పురా ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బాధితులతో పాటు.. ప్లాట్లు చేసి అమ్మేసిన రియల్ ఎస్టేట్‌వ్యాపారులను కూడా హైడ్రా కార్యాలయానికి పిలిపించి ఏవీ రంగనాథ్ బాధితులతో మాట్లాడారు. వెంకటరమణా కాలనీ, చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, గోల్డెన్ కేవ్ కాలనీవాసులు ఒకరి లే ఔట్‌లోకి మరొకరు వచ్చేసినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయా కాలనీ వాసులతో పాటు.. లేఔట్లు వేసిన వారిని కూడా నేరుగా విచారించారు.
ALSO READ | రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం.. డబుల్ బెడ్రూం లబ్దిదారులకూ సీఎం రేవంత్ గుడ్ న్యూస్
ఒకదానితో ఒకటి లింకుగా ఫిర్యాదులందడంతో సమగ్రసర్వే ద్వరా అసలు విషయం తేల్చుతామని రంగనాథ్ చెప్పడంతో ఫిర్యాదుదారులు సంతృప్తి చెందారు. పేదలను ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను కాపాడడం, కాలనీల్లోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు కబ్జా కాకుండా చూడడమే తమ బాధ్యతని రంగనాథ్ చెప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
15 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఇందులో ప్రభుత్వ భూమి ఎంత, పార్కుల స్థలాలు ఎక్కడున్నాయి, ఎవరి కాలనీల్లోకి ఎవరు చొరబడి ప్లాట్‌లు మాయం జేశారనేది తేల్చుతామని చెప్పారు. త్వరలోనే రుణ సంస్థలతో కూడా సమావేశం పెట్టి వారి పాత్రను రుణాలు మంజూరు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తామన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించడానికి రుణాలు ఇస్తే.. పేదవారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు హైడ్రా కమిషనర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.