హైడ్రా పేరిట హడావుడి

హైడ్రా పేరిట హడావుడి
  • రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్


హైదరాబాద్: ప్రతిరోజు వార్తల్లో నిలవాలని హైడ్రా పేరిట హడావుడి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతోందని మండిపడ్డారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పితే ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్​లో లక్ష్మణ్​మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ కు తెరదీశారు.

వర్షాలు పడినా, వ్యాధులు ప్రబలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా చీమకుట్టినట్లు కూడా లేదు. గ్యారెంటీల పేరిట అమలుకాని హామీలు ఇచ్చి మోసం చేశారు. రైతుల పాలిట కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారింది. రాష్ట్రంలో టీచర్ల కొరత కారణంగా 1,800 స్కూల్స్​మూతపడ్డాయి. బీసీ డిక్లరేషన్ ఏమైంది? కులగణన లేదు.. సర్వే లేదు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటు..వాజ్ పేయి.. ఒక్క సీటుతో అధికారం కోల్పోయారు.. అది తెలిసి కూడా మేం ఫిరాయింపులకు పాల్పడలేదు’అని లక్ష్మణ్​తెలిపారు