రాంనగర్​లో హైడ్రా కూల్చివేతలు 

రాంనగర్​లో హైడ్రా కూల్చివేతలు 
  • కల్లు కాంపౌండ్​, బార్​ అండ్​ రెస్టారెంట్ ​నేలమట్టం
  • ఫిర్యాదుతో రెండురోజుల కిందపర్యటించిన హైడ్రా చీఫ్​ రంగనాథ్​
  • అధికారుల నివేదికతో డిమాలిషన్​ 

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని రాంనగర్ మణెమ్మ వీధిలో అక్రమ నిర్మాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. రెండు కట్టడాలను శుక్రవారం కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విక్రమ్, సాయి యాదవ్ కు చెందిన 50 గజాల స్థలంలో ఉన్న రూమ్, ఎల్లయ్య పేరుతో ఉన్న మూడు అంతస్తుల భవనంలో సగ భాగం కూల్చివేశారు. ఈ భవనంలోనే కింద కల్లు కాంపౌండ్ ఉండగా, పై అంతస్తుల్లో వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకే మూడు జేసీబీలతో పెద్ద సంఖ్యలో హైడ్రా సిబ్బంది మణెమ్మ వీధికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్​హఫీజ్ పర్యవేక్షణలో ముందుగా మణెమ్మ వీధి చివర ఉన్న విక్రమ్ యాదవ్ ఇంటిని కూల్చారు. తర్వాత వెనక వైపు ఉన్న కల్లు కాంపౌండ్ రేకుల షెడ్డును కూల్చివేశారు. డ్రిల్ మెషీన్లతో బార్ మూడు అంతస్తుల స్లాబ్స్​తొలగించారు.

ముషీరాబాద్ ఇన్​స్పెక్టర్​ రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి, బందోబస్తు నిర్వహించారు. రాంనగర్ మెయిన్​రోడ్​లో వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నియంత్రించారు. రాంనగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న మణెమ్మ వీధి రోడ్డు 24 ఫీట్ల వెడల్పు ఉండగా.. పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని, డ్రైనేజీ సమస్య తలెత్తుతున్నదని స్థానికులు కొందరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ మధ్యే ఫిర్యాదు చేశారు.

దీంతో బుధవారం సాయంత్రం బస్తీలో రంగనాథ్​ పర్యటించారు.  ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి, వాస్తవ ఆక్రమణలను గుర్తించి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ , టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రెండు విభాగాల అధికారులు గురువారం సర్వే చేసి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రోడ్డును ఆక్రమించి, నిర్మించిన రెండు  కట్టడాలను  హైడ్రా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది నేలమట్టం చేశారు. అయితే, 1966 నుంచి ఇక్కడ నివసిస్తున్నామని, 4 దశాబ్దాల నుంచి ఆస్తిపన్ను కడుతున్నామని బాధితులు విక్రమ్, సాయి యాదవ్ తెలిపారు.