- ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2 .18 ఎకరాలు
- ఉదయం 7 గంటల నుంచే కూల్చివేతలు.. 3 గంటల్లో నేలమట్టం
- హైకోర్టును ఆశ్రయించి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్న నాగార్జున
- ఆలోపే నిర్మాణాలన్నీ కూల్చివేసిన ఆఫీసర్లు
- చెరువు చుట్టూ ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలు కూడా..
- సినీ హీరో నాగార్జున ఫంక్షన్ హాల్‌ను నేలమట్టం చేసిన హైడ్రా
- మాదాపూర్ తమ్మిడికుంట చెరువులో 3.30 ఎకరాలు ఆక్రమించినట్టు గుర్తింపు
హైదరాబాద్ / మాదాపూర్, వెలుగు: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. హైదరాబాద్ మాదాపూర్‌లో తమ్మిడికుంట చెరువు వద్ద ఉన్న ఈ నిర్మాణం కూల్చివేతను అధికారులు శనివారం భారీ బందోబస్తు నడుమ చేపట్టారు. చెరువును కబ్జా చేసి..నాగార్జున దీన్ని కట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మూడున్నర ఎకరాలు ఆక్రమించి, కన్వెన్షన్‌ను నిర్మించినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ జరిపిన హైడ్రా.. తమ్మిడికుంట ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించింది.
ఉదయం 7 గంటలకే జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో హైడ్రా ఆఫీసర్లు రంగంలోకి దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య భారీ యంత్రాలతో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఓవైపు కూల్చివేతలు జరగుతుండగానే మరోవైపు హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున.. మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్నారు. అయితే, ఆలోగా ఫంక్షన్‌హాల్ మొత్తాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే, చెరువు చుట్టూ ఉన్న మరో 6 అక్రమ నిర్మాణాలనూ కూల్చివేసింది.
10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని 29 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువును ఆనుకొని 10 ఎకరాల విస్తీర్ణంలో సినీ హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ పేరుతో 2010లో భారీ ఫంక్షన్‌హాల్ నిర్మించారు.
ఔట్‌డోర్ ఈవెంట్లు, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్తోపాటు ఇతర ఫంక్షన్లు చేసుకునేలా అందమైన లాన్, హై సీలింగ్ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టారు. 27వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో 3వేల మంది కూర్చునేలా మెయిన్‌హాల్, 26 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో బన్యన్ హాల్, మరో 5 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో డైమండ్ హాల్స్, వీటితోపాటు 37వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో గార్డెన్, చుట్టూ ప్రహరీ నిర్మించి, అద్దెకిస్తున్నారు. 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇవ్వగా, అప్పట్లో నాగార్జున హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై పలువురు సోషల్యాక్టివిస్టులు లోకాయుక్త ని ఆశ్రయించగా, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు 2021 లోనూ ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేసి, చెరువు ఆక్రమణకు గురైనట్టు తేల్చారు. కానీ, నాటి బీఆర్ఎస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఒక్క అంగుళం కూడా ఆక్రమించలే: నాగార్జున
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టుల నుంచి తెచ్చుకున్న స్టే ఆర్డర్లను పట్టించుకోకుండా ఎన్ -కన్వెన్షన్‌ను కూల్చేయడమేందని ప్రశ్నించారు. తాము పట్టా భూమిలో నిర్మాణాలు చేపట్టామని, ఒక్క అంగుళం కూడా చెరువు భూమిని ఆక్రమించలేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కూల్చివేతకు నోటీసులు ఇవ్వగా, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామని తెలిపారు. కోర్టు తనకు వ్యతిరేకంగా నాడు తీర్పు ఇచ్చి ఉంటే.. తానే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేవాడినని ఆయన చెప్పారు. తాజా పరిణామాల వల్ల తాము అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ప్రజలు తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉందన్నారు.
మూడు గంటల్లో నేలమట్టం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రేటర్హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించేందుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటుచేసింది. కొద్దిరోజులుగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్పరిధిలోని ఆక్రమణలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ్మిడికుంట చెరువు స్థలంలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. మూడు రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు.
వీటిపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ్మిడి కుంట ఎఫ్టీఎల్లో ఒక ఎకరా 12 గంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి, శనివారం రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలోఉదయం 7 గంటలకు ఎన్ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. చుట్టుపక్కల రోడ్లన్నీ మూసివేసి 3 జేసీబీలు, రెండు ఇటాచీలు, ఒక కాంబి కటింగ్‌మిషన్ సాయంతో 3 గంటల వ్యవధిలో నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.