గ్రేటర్ హైదరాబాద్ లో మరో ఫంక్షన్ హాల్ ను కూల్చేసింది హైడ్రా.మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ నాగిరెడ్డి కుంట చెరువు దగ్గర డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో డిసెంబర్ 6న ఉదయం నుంచే ఫంక్షన్ హాల్ ప్రహరి గోడతోపాటు ఫంక్షన్ హాల్ ను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నెంబర్ 14 లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సర్వే నెంబర్ 14 లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే నెంబరు 25 లో ఉన్న ప్రైవేటు స్థలంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.
2024 ఆగస్ట్ 24న హైదరాబాద్ మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడి కుంట పరిధిలో మూడున్నర ఎకరాల భూమి ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేశారు.
జనవరి నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి
క్రమంలోనే ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. 2025 జనవరి నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి నేరుగా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులను తీసుకోనున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారంటూ ఇప్పటికే రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిష్కరించడానికి ఫీల్డ్‌కు వెళ్తే అక్కడ కూడా జనాల నుంచి కంప్లయింట్స్వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు హైడ్రాకు సుమారు10 వేలకు వరకు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.
ప్రతి సోమవారం ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు పూర్తి వివరాలు పొందుపర్చాలని సూచిస్తోంది. ఆక్రమణలకు సంబంధించిన సర్వే నంబర్లు, ఫొటోలు, ఇతర ఆధారాలుంటే జత చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచిస్తోంది. కంప్లయింట్వచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ఫీల్డ్‌కు వెళ్లి విచారణ జరిపి, నిజంగా ఆక్రమణ జరిగిందని తేలితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోనుంది.