కీసర: మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ ఈస్ట్ హనుమాన్ నగర్ సర్వే నంబరు 146లో 40 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని బుధవారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగారం ప్రధాన రహదారికి కలిసే రోడ్డును నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్టు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదు అందింది. స్పందించిన హైడ్రా అధికారులు రెండు రోజులపాటు విచారణ చేపట్టి రోడ్డు ఆక్రమించినట్టు నిర్ధారించారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు బుధవారం ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. నాగారం ప్రధాన రహదారికి కాలనీల నుంచి నేరుగా వెళ్లేందుకు అవకాశం లభించడంతో 5 కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మించాలని నాగారం మున్సిపల్ కమిషనర్‌ను హైడ్రా అధికారులు కోరారు. రోడ్డు వేసి, కాలనీల వాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.