వరంగల్లో కబ్జాలపై అధికారుల దూకుడు

వరంగల్లో కబ్జాలపై అధికారుల దూకుడు
  • వరంగల్ లో సర్కార్ జాగాల్లో కట్టడాలపై సర్వే  
  • ఇన్ చార్జ్ మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు 
  • రెండు, మూడు రోజులుగా అక్రమ నిర్మాణాలకు నోటీసులు 

వరంగల్, వెలుగు : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని ‘హైడ్రా’ తరహాలోనే ఓరుగల్లులోనూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆదేశాలతో గ్రేటర్​వరంగల్ పరిధిలోని కలెక్టర్లు, కార్పొరేషన్ కమిషనర్​ప్రత్యేక టీమ్ లతో రెండు, మూడు రోజులుగా చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములను సర్వే చేస్తున్నారు. 

మొదటగా భూముల హద్దులను గుర్తిస్తూ  మార్కింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం భూమి ఎంత.. అందుబాటులో ఎంత ఉంది.. కబ్జాకు గురైనది ఎంత.. అనే వివరాలతో రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలను గుర్తించి కొందరు పెద్దలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

లీడర్లు..పేదల గుడిసెల పేరిట కబ్జా 

గ్రేటర్‍ వరంగల్ లో పదుల సంఖ్యలో  చెరువులు, కుంటలు ఉండగా.. వీటిలో మొత్తంగా 250 ఎకరాలు  అక్రమార్కులు కబ్జా చేసినట్టు తెలుస్తోంది. భద్రకాళి చెరువు 350 ఎకరాల్లో ఉండగా.. 60 ఎకరాలు, ములుగు రోడ్ లోని కోట చెరువు 120 ఎకరాలకు 30 ఎకరాలు,  చిన్న వడ్డేపల్లి చెరువు100 ఎకరాల్లో దాదాపు 30 ఎకరాలు కబ్జా అయినట్లు అధికారులు అంచనా వేశారు. 

బంధం చెరువు పరిధిలో కొందరు పేదలు గుడిసెలు వేసుకోగా.. మిగతాచోట్ల 25 నుంచి 30 ఎకరాలను లీడర్ల పేరిట అక్రమార్కులు కబ్జా చేశారు. గోపాలపూర్‍ చెరువు ఆకారం కోల్పోయింది. పోచమ్మకుంట చెరువు స్థలాన్ని గత సర్కార్ లో సిటీకి చెందిన కొందరు ఎమ్మెల్యే అనుచరులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఇక్కడ పేదల గుడిసెల సాకుతో లీడర్లు భారీగా అక్రమించేశారు.  మరికొన్నిచోట్ల గుడిసెలు వేయించి..  

అందులో సగానికి పైగా గుడిసెలకు డిమాండ్ ను బట్టి  రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని,  మరి కొన్నిచోట్ల తప్పుడు డాక్యుమెంట్లతో ప్రజలకు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి.  

జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆదేశాలతో..

హైదరాబాద్ లోని హైడ్రా తరహాలో గ్రేటర్​వరంగల్ లోనూ వాడ్రా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో కొద్దిరోజుల కిందట వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తన పర్యటనలో భాగంగా దీనిపై అధికారులతో సమీక్షించారు. సిటీలోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలపై ఎమ్మెల్యే, అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  వెంటనే మంత్రి స్పందిస్తూ.. 

ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా ఉపేక్షించవద్దని స్పష్టంచే శారు. ఎంత పెద్దవారున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాలాలపై నిరుపేదలు ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని అధికారులకు సూచించారు. దీంతో  రెండు, మూడు రోజులుగా గ్రేటర్ అధికారులు ప్రభుత్వ భూములు సర్వే నిర్వహిస్తూ.. హద్దులు ఖరారు చేస్తున్నారు. 

ఎమ్మెల్యే నాయిని చొరవతో..

హనుమకొండలో వరదలతో ముంపునకు గురయ్యే నయీంనగర్​నాలాపై ఆక్రమణలను పదేండ్లలో బీఆర్ఎస్​ప్రభుత్వం పట్టించుకోలేదు.  కాంగ్రెస్​ సర్కారు వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి చొరవతో నెలన్నరలోనే అక్రమ కట్టడాలు​కూల్చివేశారు. నాలాకు ఇరువైపులా రిటెయినింగ్ వాల్ నిర్మించారు. ఇప్పుడు ఇన్ చార్జ్ మంత్రి కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ ఆదేశించడంతో హనుమకొండ కలెక్టర్ ​ప్రావీణ్య సిటీలో నాలాల అభివృద్ధి, విస్తరణకు ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.  రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల, కుడా, టౌన్ ప్లానింగ్, ఆర్అండ్ బీ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 

ఎఫ్టీఎల్, బఫర్​ జోన్​ పరిధి ఎక్కడి వరకు ఉందో సర్వే చేయాలని స్పష్టంచేశారు. అక్రమ నిర్మాణాలపై రిపోర్ట్​ను అందజేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నారు.  కాగా.. చెరువుల పరిధిలోని కొన్ని నిర్మాణాలను ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో కూల్చివేశారు.