హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా.. మరోసారి యాక్షన్ షూరు చేసింది. సోమవారం (ఫిబ్రవరి 3) శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందింది.
స్థానికుల ఫిర్యాద మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థలాలను పరిశీలించిన అధికారులు.. నిర్మాణాలు అక్రమమని నిర్ధారించారు. ఈ క్రమంలోనే సంపత్ నగర్లోలో ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మించిన కట్టడాలను, ఊట్పల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
సోమవారం (ఫిబ్రవరి 3) ఉదయం నుంచే హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులను మోహరించారు. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు హెచ్చరించారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ రక్షణ కోసం ప్రతిష్టాత్మంగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులు కల్పించింది. ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే.. హైడ్రా ప్రతి సోమవారం ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రజా వాణిలో కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తు్న్నారు. ఫిర్యాదు అందించిన వెంటనే సంబంధిత స్థలాన్ని పరిశీలించి.. అక్రమమని తేలితే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు.