- ఆధారాల్లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్ల?
- కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టు
- కౌంటర్ వేయాలని హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు
హైదరాబాద్, వెలుగు : హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని హైకోర్టు చెప్పింది. హైడ్రా.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతున్నదని, వాటిని వెంటనే ఆపాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేఏ పాల్ వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు. ‘‘చెరువుల రక్షణ చర్యలు అభినందనీయం. కానీ, ఆ చర్యలు చట్ట ప్రకారం ఉండాలి.
పేదల ఇండ్లను కూల్చేస్తున్న హైడ్రా.. పెద్దల ఇండ్లను కూల్చడం లేదు. సీఎం సోదరుడి ఇంటికి నోటీసు ఇచ్చి 30 రోజులైనా ఇప్పటి వరకు కూల్చివేతలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలి” అని కోరారు. ‘‘సర్వే చేసి ఆక్రమణలను గుర్తించాకే నోటీసులు ఇవ్వాలి. ఇండ్లను ఖాళీ చేయడానికి నెల రోజుల టైమ్ ఇవ్వాలి. ఇండ్లు కోల్పోయిన పేదలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన హైకోర్టు ‘అక్రమంగా ఎవరి ఇండ్లను కూల్చారో, ఎవరి ఇండ్లను కూల్చుతున్నారో వివరాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాల్లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వమంటే ఎట్ల? వివరాలేమీ లేకుండా గాలి మాటలతో స్టే ఆర్డర్ అడిగితే ఇవ్వలేం” అని చెప్పింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్ప ష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.