హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా వెనక్కి తగ్గటం లేదు. కూకట్ పల్లి నిజాంపేట మెయిన్ రోడ్డులో.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వెనక భాగంలో.. ఆర్మీ ఉద్యోగికి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.
ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించిన స్థలం చుట్టుపక్కల వాళ్లు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ప్రహరీగోడలు కట్టేశారు. కొన్నేళ్లుగా ఈ విషయంపై ఆర్మీ ఉద్యోగి పోరాటం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలోనే పక్కా ఆధారాలతో హైడ్రాకు కంప్లయింట్ చేశారు ఆ ఆర్మీ ఉద్యోగి.
Also Read :- హైదరాబాద్ ప్రిజం పబ్ కాల్పుల కేసులో సాఫ్ట్ వేర్ అరెస్ట్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు.. అది ప్రభుత్వ స్థలం అని.. ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించిన స్థలం అని నిర్థారణకు వచ్చారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నిర్థారించిన హైడ్రా అధికారులు.. 2025, ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం జేసీబీలతో స్పాట్ కు వచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గేట్లు పీకేశారు.. ప్రహరీ గోడలు కూల్చేశారు.. ఆ ఆర్మీ ఉద్యోగికి చెందిన 300 గజాల స్థలాన్ని అతనికి క్లీన్ అండ్ క్లియర్ గా అప్పగించారు.
హైడ్రా చర్యలపై నిజాంపేట స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆక్రమణలపై ఇలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగినందుకు నిజాంపేట స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు చెబుతున్నారు.