ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలం నారపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన 4 కిలోమీటర్ల భారీ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఈనెల 8న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దివ్యానగర్ లేఅవుట్లను పరిశీలించారు. అక్రమ కట్టడాలుగా తేలడంతో శనివారం ఉదయం పెద్దసంఖ్యలో పోలీసులు, హైడ్రా అధికారులు దివ్యానగర్‌కు చేరుకొని ఆ కాలనీ చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీని నేలమట్టం చేశారు. కూల్చివేతల అనంతరం మీడియాకు రంగనాథ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే ప్రహరీగోడ నిర్మించుకునే అనుమతి ఉంటుందని, కానీ.. నల్ల మల్లారెడ్డి 4 కి.మీ. పొడవునా ఎత్తైన కాంపౌండ్ గోడను ఈ కాలనీ చుట్టూ నిర్మించి ఇతర గ్రామాల ప్రజలకు సంచారం లేకుండా నియంతలా వ్యవహరించాడని రంగనాథ్ తెలిపారు. ‘‘పోచారం మున్సిపాలిటీలోని కాచవాని సింగారం, కొర్రెమల రెవెన్యూ గ్రామాల పరిధిలో 1990లో నల్ల మల్లారెడ్డి 200 ఎకరాల్లో లేఅవుట్ డెవలప్ చేశారు. వీటిలోని 2,200 ప్లాట్లను సింగరేణి ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేశారు.
ఒప్పందం ప్రకారం ఆయన డ్రైనేజీ, రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇందుకోసం అదనంగా రూ.10 కోట్లు వసూలు చేశాడు. 15 ఏండ్ల క్రితంసెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లేఅవుట్ చుట్టూ 4 కి.మీ. ఎత్తైన కాంపౌండ్ వాల్ నిర్మించాడు. కాలనీల్లో మాత్రం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మిగతా చోట్ల రోడ్లన్నీ మూసివేసి, దివ్యానగర్ తో పాటు మరో ఆరు కాలనీలకు రెండు చోట్ల నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగించారు. ఆ కాలనీల్లో ప్లాట్ల క్రయవిక్రయాలన్నీ ఆయన ఆదేశాల మేరకే జరగాలి. లేదంటే అందరినీ ఇబ్బందులకు గురిచేసేవారు” అని రంగనాథ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాలనీలోని పార్కులను, ఓపెన్ స్థలాలను ఆయన ఆక్రమించారని తెలిపారు. సింగరేణియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని, హైడ్రా నిబంధనల మేరకే కూల్చివేతలు చేపట్టామని స్పష్టం చేశారు.
కోర్టు ఆదేశాలు పాటించకుండా కూల్చేశారు: నల్ల మల్లారెడ్డి
దివ్యానగర్ కాలనీ వాసుల భద్రత కోసం నిర్మించిన గోడలు, గేట్లను హైడ్రా కూల్చివేయడాన్ని వెంచర్ డెవలపర్ నల్ల మల్లారెడ్డి ఖండించారు. తాను తీసుకున్న భద్రత వల్లే ఇప్పటి వరకు కాలనీలో దొంగతనాలు జరగలేదని, ప్లాట్లు ఆక్రమణకు గురికాలేదని ఆయన చెప్పారు. భద్రతగా ఉన్న గోడలను కూల్చడం అన్యాయమని, ప్రశ్నించిన ప్రజలను పోలీసులు బలవంతంగా నెట్టివేశారన్నారు. ప్రజల సమక్షంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కోర్టు ఆదేశాలు పాటించకుండా కాంపౌండ్ గోడను కూల్చివేశారన్నారు. ఈ కూల్చివేతలపై హైకోర్టులో సవాలు చేస్తానని ఆయన తెలిపారు. కాగా.. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్‌కు స్థానికులు పాలాభిషేకం చేశారు.