భూకబ్జాలపై హైడ్రా మరోసారి కన్నెర్ర జేసింది. నిబంధనలకు విరుద్ధంగా చెరువు కబ్జా చేసి ఓ మాజీ ఎమ్మెల్యే నిర్మించిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రాఅధికారులు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను కూల్చివేశారు.
సర్వే నెంబర్ 193, 194,323 లలోని 24 ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు. అయితే సదరు ఫెన్సింగ్ ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్, రోహిత్, పుల్లారెడ్డిలు తిరిగి నిర్మించారని పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
Also Read :- మూడేండ్లలో రోడ్ల అభివృద్ధి
ఈ వివాదంలో సర్వే జరుగుతున్నప్పటికీ గతంలో నిర్మాణాలు కూల్చివేసిన స్థలంలో తిరిగి ఫెన్సింగ్ వేశారని అసోసియేషన్ సభ్యులు సోమవారం ప్రజావాణిలో హైడ్రా కు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తిరిగి మళ్ళీ ప్రహరీ గోడను,చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను కూల్చివేశారు.
ఈ సందర్భంగా పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ..గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ప్లాట్లను చేరుకోవడం ఇబ్బందికరంగాఉందని తమ స్థలాలను కబ్జా చేయడానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.