అమీన్​పూర్​, కూకట్​పల్లిలో హైడ్రా కూల్చివేతలు

అమీన్​పూర్​, కూకట్​పల్లిలో హైడ్రా కూల్చివేతలు
  • మొత్తం 44 అక్రమ నిర్మాణాలు నేలమట్టం
  • అమీన్​పూర్​లో 25 విల్లాలు, మూడు అపార్ట్​మెంట్లు నేలమట్టం
  • కూకట్​పల్లిలోని నల్ల చెరువులో 16 షెడ్లు కూల్చివేత
  • ఎకరం ప్రభుత్వ భూమి స్వాధీనంపటేల్​గూడలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత
  • మూడు ఎకరాల్లో విల్లాల నిర్మాణం
  • కిష్టారెడ్డిపేటలో మూడు అపార్ట్​మెంట్లు కూల్చివేత

కూకట్​పల్లి/రామచంద్రాపురం, వెలుగు: కూకట్​పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. మొత్తం 44 నిర్మాణాలను నేలమట్టం చేశారు. నల్ల చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​లో ఉన్న 16 షెడ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. నల్ల చెరువు 27 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లోని ఏడు ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు అధికారులు తేల్చారు. అదేవిధంగా.. పటేల్​గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని 28 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వీటిలో 25 విల్లాలు, మూడు అపార్ట్​మెంట్లు ఉన్నాయి. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.

నోటీసులు ఇవ్వలేదంటున్న బాధితులు

.కూకట్​పల్లిలోని నల్ల చెరువు ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు ఉదయం 8 గంటలకే 20 మంది హైడ్రా సిబ్బంది స్పాట్​కు చేరుకున్నారు. 11 గంటల్లోపే రెండు జేసీబీలతో 16 షెడ్లను నేలమట్టం చేశారు. పక్కాగా నిర్మించుకుని నివసిస్తున్న వారి ఇండ్ల జోలికి వెళ్లలేదు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు కరెక్ట్ కాదని, ఖాళీ చేసేందుకు కొద్దిగా టైమ్ ఇవ్వాలని బాధితులు హైడ్రా అధికారులు, పోలీసుల కాళ్ల మీద పడి బతిమాలారు. రెండు రోజుల కిందే నోటీసులు ఇచ్చి సామాన్లు తీసుకెళ్లేందుకు టైమ్ ఇచ్చామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాధితులను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.

క్యాటరింగ్, ప్రింటింగ్​ ప్రెస్​లు

చెరువును ఆక్రమించి నిర్మించిన 16 షెడ్లలో అందరూ కిరాయికే ఉంటున్నారు. 14 షెడ్లలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటుండగా వారు ఇప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఒక స్థలాన్ని రెండేండ్ల కింద రమేశ్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని షెడ్ వేసుకున్నాడు. అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ నిర్వహిస్తున్నాడు. దీని కోసం అతను సుమారు రూ.50లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. మిగిలిన ఇంకో స్థలాన్ని ఏడాది కింద రవి అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. అందులో జీఆర్ సింబల్స్ అండ్ డిజిటల్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. కోటి రూపాయలకుపైగానే ఖర్చు పెట్టానని రవి చెప్తున్నాడు. మెషినరీలు, ఇతర సామాగ్రిని తీసుకెళ్లేందుకు అవకాశం ఇచ్చిన అధికారులు.. తర్వాత రమేశ్, రవి షెడ్లను కూల్చేశారు.

27 ఎకరాల్లో ఏడు ఎకరాలు కబ్జా

కూకట్​పల్లిలోని నల్ల చెరువు 27 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అందులోని ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లోని ఏడు ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. బఫర్​జోన్​లోని నాలుగు ఎకరాల్లో అపార్ట్​మెంట్లు, 50 బిల్డింగులు ఉన్నాయి. ఎఫ్​టీఎల్ పరిధిలోని మూడు ఎకరాల్లో 25 బిల్డింగులు కట్టుకోగా, 16 షెడ్లు వేసుకున్నారు. పక్కా భవనాలు, అపార్ట్​మెంట్లను వదిలేసిన అధికారులు.. షెడ్లను కూల్చేసి ఎకరం ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు.

అమీన్​పూర్​లోనూ కూల్చివేతలు

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోనూ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. పటేల్​గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో 28 నిర్మాణాలను నేలమట్టం చేశారు. వాటిలో 25 విల్లాలు, మూడు అపార్ట్​మెంట్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన కూల్చివేతలు.. రాత్రి వరకు కొనసాగాయి. పటేల్​గూడ సర్వే నంబర్ 12లో బీఆర్ఎస్ లీడర్ చంద్రశేఖర్ దాదాపు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి 25 విల్లాలు కట్టాడు. వాటిని రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్​తో పాటు మరికొంత మందిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా వారంతా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర కిలో మీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. విల్లాల వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్, అమీన్​పూర్ తహసీల్దార్ రాధ, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కూల్చి వేతలు జరిగాయి.

గతంలోనే  బయటపెట్టిన ‘వెలుగు’ 

ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ గతంలోనే ‘వెలుగు’ కథనాన్ని పబ్లిష్ చేసింది. దీంతో స్పందించిన అధికారులు అనుమతులు రద్దు చేశారు. అయినప్పటికీ కొందరు ప్రభుత్వ సూచిక బోర్డులను తొలగించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా... విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను తేల్చింది. ఇటీవల అమీన్​పూర్​లో హైడ్రా దూకుడును గమనించిన కొందరు అక్రమార్కులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి అపార్ట్​మెంట్లను ఆక్యుపై చేసేందుకు ప్రయత్నించగా.. వాటిని కూల్చేశారు.

ఐదంతస్తుల అపార్ట్​మెంట్లు కూల్చివేత

అమీన్​పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట ఈద్గా ముందున్న ఐదంతస్తుల మూడు అపార్ట్​మెంట్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ సర్వే నంబర్ 164లోని దాదాపు ఎకరా స్థలం ఆక్రమించి మూడు భారీ అపార్ట్​మెంట్లు నిర్మించారు. వీటిలో రెండు అపార్ట్​మెంట్లు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కాంగ్రెస్ నేత పొదలకంటి కళ్యాణ్​దిగా హైడ్రా అధికారులు గుర్తించారు. మరో అపార్ట్​మెంట్ నేపాల్ మంత్రికి చెందిన బంధువులది తేలింది.