చెరువుల వద్ద హైడ్రా గస్తీ

చెరువుల వద్ద హైడ్రా గస్తీ
  • ఒక్కోచోట ఏడుగురు లేక్ ప్రొటెక్షన్ గార్డ్స్  
  • మట్టి, వ్యర్థాలు వేయకుండా, ఆక్రమించుకోకుండా చర్యలు
  • ప్రస్తుతం 70 చెరువుల వద్ద డ్యూటీ
  •  త్వరలో 549 చెరువుల వద్ద సిబ్బంది నియామకం

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులను ఆక్రమణల నుంచి కాపాడడమే కాకుండా కలుషితం కాకుండా చూసేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణదారులు చెరువుల్లో మట్టి పోసి కబ్జా చేయకుండా, వ్యర్థాలు వేసి పాడు చేయకుండా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను నియమిస్తోంది. ఒక్కో చెరువు వద్ద ఒక్కో షిఫ్ట్ లో ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో డ్యూటీ చేసేందుకు ఏడుగురిని కేటాయిస్తోంది. వీరిలో రోజుకొకరు వీక్ ఆఫ్ లో ఉంటారు. హైడ్రా పరిధిలో 549 చెరువులు ఉండగా, ముందు ముఖ్యమైన 70 చెరువుల వద్ద హైడ్రా గార్డులను ఏర్పాటు చేసింది. 

ఇందులో సున్నం చెరువు, తమ్మిడికుంట, పటేల్ చెరువు, నల్లచెరువుతోపాటు పలు ముఖ్యమైన చెరువులు ఉన్నాయి. రానున్న రోజుల్లో మిగతా చెరువుల వద్ద కూడా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో గస్తీ నిర్వహించేందుకు ప్లాన్​చేస్తోంది. ఒక్కో చెరువు వద్ద ఏడుగురి చొప్పున 3,500 మంది అవసరం ఉండగా, వారిని రిక్రూట్​చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ గార్డులకు ఇన్​చార్జీలను నియమించి సీసీ కెమెరాల ద్వారా లైవ్ లో అక్కడ ఏం జరుగుతోందన్నది హైడ్రా అధికారులు మానిటరింగ్ చేయనున్నారు.  

పోలీస్​జాబ్స్​మిస్సయిన వారికి చాన్స్

పోలీసు రిక్రూట్ మెంట్ లో కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో లేక్​ప్రొటెక్షన్​ఫోర్స్​కోసం హైడ్రా రిక్రూట్ చేసుకుంటోంది. ముందుగా 490  మందిని తీసుకుని అంబర్ పేట పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే రెండు బ్యాచ్ లు ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, మరో బ్యాచ్ కి ప్రస్తుతం ట్రైనింగ్​నడుస్తోంది. 

ట్రాక్టర్లు, టిప్పర్లపై కేసులు 

గతంలో అర్ధరాత్రి పూట చెరువుల్లో మట్టి నింపి పలువురు రియల్టర్లు, లీడర్లు, స్థానికులు కబ్జాలకు పాల్పడ్డారు. సిటీ శివారుల్లోని చెరువుల దగ్గర ఇలా జరిగిందని గుర్తించిన హైడ్రా గార్డుల ఏర్పాటుతో చెక్​పెట్టాలని భావించింది. అందులో భాగంగా ముందు 70 చెరువుల వద్ద గార్డులను కాపలా పెట్టగా కొన్ని చెరువుల వద్ద పరిస్థితి మారింది. అంతకుముందు రాత్రిళ్లు కొందరు పరిశ్రమల నుంచి వ్యర్థాలు, కెమికల్స్​తీసుకువచ్చి చెరువుల్లో కలిపేవారు. 

దీంతో అవి విషపూరితంగా మారాయి. లేక్​ప్రొటెక్షన్​ఫోర్స్​వచ్చాక రాత్రి పూట మట్టి నింపే ఘటనలు కూడా తగ్గాయి. మట్టి డంప్ చేయడానికి వస్తున్న వాహనాలను లేక్​ప్రొటెక్షన్​ఫోర్స్​పట్టుకుంటోంది. పలు టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్​చేసి కేసులు కూడా నమోదు చేయించారు. ఘటనల గురించి ఎప్పటికప్పుడు హెడ్డాఫీసుకు రిపోర్ట్​చేస్తుండడంతో ఉన్నతాధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.